ఐటీని వణికిస్తోన్న నీటి సంక్షోభం

17 Jun, 2019 16:03 IST|Sakshi

సాక్షి, చెన్నై: చెన్నైలో రోజు రోజుకి పెరుగుతున​ నీటి సంక్షోభం అక్కడి ప్రజలతోపాటు ఐటీ సంస్థలను కూడా బెంబేలెత్తిపోతున్నాయి. నీటి సమస్యను తట్టుకోలేక కోన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇం‍టి నుంచే పని చేయాలని కోరాయి. ‍నీటి సమస్య తీవ్రతరం కావడం.. తమ కార్యాలయాల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీలే కాదు.. చెన్నైలోని రెస్టారెంట్లు కూడా నీటి సంక్షోభంతో చేతెలెత్తేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు తగినంత నీటిని అందుబాటులో ఉంచలేక పలు రెస్టారెంట్లు కేవలం టిఫిన్లు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నాయి. నీరు అందుబాటులో లేకపోవడంతో భోజనం సదుపాయం కల్పించలేకపోతున్నామని చెప్తున్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గించాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. 

ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి సంక్షోభం మీద నివేదికను కోరినట్లు సమాచారం. నీటి సంక్షోభం వల్ల అనేక సంస్థలు మూసివేయబడ్డాయని, ఐటీ కంపెనీలయితే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే పరిస్థతికి దిగజారాయని, ఇవేవి పట్టించుకోకుండా అవినీతితో బిజీగా ఉన్న మున్సిపల్‌ మంత్రి వేలుమణి దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి  ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు