చెన్నైతో పాటు ఐదు నగరాల్లో ఆంక్షలు కఠినతరం 

25 Apr, 2020 13:06 IST|Sakshi

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఐదు నగరాల్లో ఆంక్షలు కఠినతరం 

ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు అమలు 

రాష్ట్రంలో 1,755 చేరిన కేసులు

సాక్షి , చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు చెన్నై, కోయంబత్తూరు, మధురై జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సేలం, తిరుప్పూర్‌లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్‌ అమల్లో కానుంది. 

కాగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు కిరాణా, కూరగాయలు, నిత్యావసరాల కోసం క్యూలు కట్టారు. శనివారం ఉదయం నుంచే జనాలు పెద్ద ఎత్తున నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో షాపుల వద్ద ప్రజల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఓ వైపు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నా... జనాలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఇదిలా ఉండగా శుక్రవారం 72 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,755కి పెరిగింది. అలాగే మరో ఇద్దరు మృతితో మరణాల సంఖ్య 22కి చేరుకుంది. (కరోనా : ప్రాణం తీసిన అభిమానం )

వీరికి మాత్రమే మినహాయింపు.. 
ఆసుపత్రులు, వైద్య పరిశోధనలు, అంబులెన్స్, శ్మశానశకటాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర విధులు నిర్వర్తించే సచివాలయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పోలీస్, తాగునీరు, విద్యుత్‌ శాఖల సిబ్బంది, రెవెన్యూ, ప్రకృతి విపత్తుల సహాయ బృందాలు, ఆవిన్‌ సిబ్బంది పనిచేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో అత్యవసర విధుల్లో ఉండే 33 శాతం సిబ్బందికి మాత్రమే అనుమతి. అమ్మాక్యాంటీన్లు, ఏటీఎం సెంటర్లు యథావిధిగా పనిచేస్తాయి. హోం డెలివరీ చేసే రెస్టారెంట్లకు అనుమతినిచ్చారు. (లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి కరోనా సినిమా)

వృద్ధులు, దివ్యాంగులు, అనాధలకు సేవలందించేవారికి సైతం తగిన అనుమతితో మినహాయింపు ఉంటుంది. కోయంబేడు వంటి హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లు, సంతలు వారికి సూచించిన ఆంక్షలకు కట్టుబడి నిర్వహించాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్ల మొబైల్‌ వాహనాలను అనుమతిస్తారు. కాగా తమిళనాట మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ సూచించిన విషయం తెలిసిందే. వైద్య పరంగా మరింత మెరుగైన చర్యలను విస్తృతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో  ఆదేశించారు. చెన్నైలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా కేంద్రం నుంచి ప్రత్యేక బృందం వస్తుందన్ని పేర్కొన్నారు. (రోడ్ల మీద తిరుగుతున్న రోనా)

మరిన్ని వార్తలు