అడ్డంగా వాడేశారు..

31 Aug, 2019 11:34 IST|Sakshi

ఫోర్జరీ డాక్యుమెంట్లతో క్రెడిట్‌ కార్డులు

రూ.5 లక్షలు వినియోగం

నలుగురి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: ఫోర్జరీ చేసిన పాన్‌కార్డు, ఆధార్‌కార్డుల వివరాలు సమర్పించి క్రెడిట్‌ కార్డులు తీసుకుని రూ.5 లక్షలు వినియోగించిన నలుగురి సభ్యుల ముఠాను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమ్మినేని బాలకృష్ణ, వక్దాని మహేష్, పొలగాని నరేశ్‌ కుమార్‌ అనే వ్యక్తులు గతంలో సోమాజిగూడలోని స్టాఫ్‌ రిక్రూటింగ్‌ కంపెనీలో పని చేశారు. ఈ సందర్భంగా  డైరెక్ట్‌ సేల్స్‌ ఏజెన్సీతో దర ఖాస్తు చేసిన వారి పాన్‌కార్డు, ఆధార్‌కార్డులతో పాటు ఆయా వ్యక్తుల ఫొటో కాపీలను సేకరించారు. ప్లాస్టిక్‌ కార్డులపై ఆయా కార్డుల వివరాలను ఫోర్జరీ చేసిన సల్లూరి రాజేందర్‌ ఒరిజినల్‌ పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల తరహాలో నకిలీవి తయారు చేసి వారికి ఇచ్చాడు. అనంతరం ఫోర్జరీ కార్డులతో అసలు వ్యక్తులుగా క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. క్రెడిట్‌ కార్డులు మంజూరు కాగానే వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వినియోగించారు.

సైనిక్‌పురికి చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్‌  ఇంటికి వచ్చిన బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌లు రూ.ఐదు లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అతను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ అశిష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం టెక్నికల్‌ డాటా ఆధారంగా సరూర్‌నగర్‌లో నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, 16 ఏటీఎం కార్డులు, ఒక ల్యాప్‌టాప్, ఏడు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, 25 ఆధార్‌కార్డు కాపీలు, 15 పాన్‌కార్డు కాపీలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2,30,000 నగదు రికవరీ చేశారు.  నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులకు ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను సమకూర్చడంతో పాటు క్రెడిట్‌ కార్డులపై ఉన్న వివరాలను ఫొటోషాప్‌ ద్వారా ఎడిటింగ్‌ చేసి ఇచ్చిన మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. 

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా