దినకరన్‌కు షాక్‌!

23 Sep, 2017 03:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: తెన్‌కాశి ఎంపీ వసంతి మురుగేషన్‌ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు షాక్‌ ఇచ్చారు. ఆ శిబిరం నుంచి సీపీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల శిబిరంలోకి చేరారు. దినకరన్‌ను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలతో మంతనాల నిమిత్తం కుడగులోని క్యాంప్‌లో దినకరన్‌ తిష్ట వేశారు. సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల కలయికతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఆయనకు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు కదిలినా, 18 మంది మాత్రం కుడుగు క్యాంప్‌లో ఉన్నారు. ఈ 18 మందిపై అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు డైలమాలో పడ్డారు.

 అలాగే, దినకరన్‌కు మద్దతుగా ఇన్నాళ్లు ఎంపీలు నాగరాజన్, విజిలా సత్యనంద్, సెంగుట్టవన్, ఉదయకుమార్, గోకులకృష్ణన్, నవనీత కృష్ణన్, రాధాకృష్ణన్, వసంతీ మురుగేషన్‌ వ్యవహరిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎంపీల్లో ఆందోళన బయలు దేరింది. దినకరన్‌కు దూరంగా ఉండడం మంచిదన్న భావనలో ఎంపీలు ఉండగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డైలమాలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎంపీ వసంతీ మురుగేషన్‌ దినకరన్‌కు షాక్‌ ఇచ్చి సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లకు జిందాబాద్‌ కొట్టారు.

దినకరన్‌కు షాక్‌:  తెన్‌కాశి పార్లమెంట్‌సభ్యురాలు వసంతీమురుగేషన్‌ ఉదయాన్నే గ్రీమ్స్‌ రోడ్డులోని సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆశీస్సులు అందుకుంటూ, ఆ శిబిరంలోకి చేరారు. అలాగే, పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం ఓ పన్నీరు సెల్వం ఇంటికి చేరుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఈపీఎస్, ఓపీఎస్‌లతో కలిసి పయనం సాగించనున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను సర్వనాశనం చేయడం లక్ష్యంగా దినకరన్‌ కుట్రలు చేస్తున్నాడని, అందుకే ఆ శిబిరాన్ని వీడినట్టు పేర్కొన్నారు. దినకరన్‌కు ఇన్నాళ్లు వెన్నంటి ఉంటూ, ఈపీఎస్, ఓపీఎస్‌లపై దుమ్మెత్తి పోశారే అని ప్రశ్నించగా, తమ చేత బలవంతంగా పలికించారని దాట వేయడం గమనార్హం. అలాగే, మిగిలిన ఏడుగురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలతో భేటీ కానున్నారని ప్రకటించారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అనేక మంది  సీఎం వైపే ఉన్నారని, వాళ్లను క్యాంప్‌లో పెట్టి ఉన్న దృష్ట్యా, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

కుడగుకు దినకరన్‌: మైసూర్‌ సమీపంలోని కుడగు క్యాంప్‌లో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్యాంప్‌నకు శుక్రవారం దినకరన్‌ చేరుకున్నారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో తదుపరి కార్యాచరణ మీద మంతనాలు సాగిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా, స్పీకర్‌ ధనపాల్‌ జారీ చేసిన అనర్హత ఉత్తర్వులను రద్దు చేయాలని మదురైకు చెందిన సామాజిక కార్యకర్త కేకే రమేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్‌ బెంచ్‌ ముందుకు ఉదయం వచ్చింది. ఇలాంటి పిటిషన్‌ విచారణ మద్రాసు హైకోర్టు సాగుతుండడం, తదుపరి విచారణ అక్టోబరు నాలుగో తేదీ జరగనున్నడాన్ని గుర్తు చేస్తూ, ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని కోర్టు తిరస్కరించింది.

మరిన్ని వార్తలు