అమ్మ... అమృత..

27 Apr, 2018 16:11 IST|Sakshi
అమృత, జయలలిత (ఫైల్‌ ఫోటో)

ప్రతి మనిషి జన్మలోనూ ‘తల్లి నిజం.. నాన్న నమ్మకం’ అనేది ప్రాచీన నానుడి. తాను పలానా దంపతుల సంతానం అని చెప్పుకోవాలంటే సదరు భార్యాభర్త జీవించి ఉన్నపుడే ప్రకటించాలి. అది జరగనపుడు సశాస్త్రీయమైన తిరుగులేని విధానం డీఎన్‌ఏ పరీక్ష. అయితే డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటే రక్త నమూనాలు తప్పనిసరి. జయలలిత తన తల్లి అంటున్న అమృత వాదనలోని నిజానిజాల కోసం జయ పార్థివదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి డీఎన్‌ఏ పరీక్షలు చేయవచ్చు.

అంతటి అవకాశాలు కనుచూపుమేరలో లేవు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం రక్తనమూనాలే. అపోలో ఆస్పత్రిలో జయ సుదీర్ఘకాలం చికిత్స పొందినపుడు వివిధ పరీక్షల కోసం సేకరించిన రక్తం ఉంటుందని కోర్టు భావించింది. అయితే సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశామని, తమ వద్ద నమూనాలు లేవని అపోలో తేల్చి చెప్పేసింది. దీంతో అమృత వారసత్వ కేసుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా రుజువుచేసుకునేందుకు అవసరమైన జయలలిత రక్త నమూనాలు తమ వద్ద లేవంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. జయకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్లరూపాయల స్థిర, చరాస్థులు ఉన్నా వారసులుగా ఎవరూ లేరు. జయ అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా గుర్తింపుకోసం న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ దశలో బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి తాను జయలలిత, శోభన్‌బాబుల ప్రేమ ఫలమని ప్రకటించుకుంది. జయ వారసురాలిగా తనను ప్రకటించాలని కోరుతూ గత ఏడాది ఆఖరులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మెరీనా బీచ్‌ సమాధి నుంచి జయ పార్థివదేహాన్ని బయటకు తీసి అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయాలని, తనకు డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందిగా కోర్టును కోరింది. ఈ కేసు న్యాయమూర్తి వైద్యనాథన్‌ సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది. జయలలిత వారసురాలినని చెప్పుకునేందుకు అమృత వద్ద అధికార పూర్వమైన ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించరాదని తమిళనాడు ప్రభుత్వం వాదన ప్రారంభించింది. ఈ పరిస్థితిలో జయలలిత రక్తనమూనాలు ఉన్నాయా అనే విషయంలో బదులివ్వాల్సిందిగా అపోలో యాజమాన్యాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.

అమృత పిటిషన్‌ కొట్టివేయాలని..
జయలలిత ఆస్తులను కాజేసే ఉద్దేశంతో అమృతవేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ కోర్టులో మరో పిటిషన్‌ వేశారు. అమృత దాఖలు చేసిన కేసు గురువారం విచారణకు రాగా అపోలో ఆస్పత్రి యాజమాన్యం తరఫు న్యాయవాది మైమునాబాషా బదులు పిటిషన్‌ దాఖలు చేశారు.

అపోలో తరఫున మరో పిటిషన్‌
అపోలో ఆసుపత్రి న్యాయవిభాగం మేనేజర్‌ మోహన్‌కుమార్‌ తరఫున మరో పిటిషన్‌ వేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘2016 సెప్టెంబరు 9వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు 75 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు మెరుగైన చికిత్సను ఆమెకు అందజేశారు. జయలలిత మరణం తరువాత అదే ఏడాది డిసెంబరు 7వ తేదీన ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశాం. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి స్వాధీనంలో జయలలితకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, రక్త నమూనాలు లేవు’’ అని కోర్టుకు వారు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు 4వ తేదీకి వాయిదావేశారు.

మరిన్ని వార్తలు