‘ఈ టెక్నిక్‌ ఫాలో అయ్యుంటే సినిమా రిలీజయ్యేది’

30 Nov, 2019 20:37 IST|Sakshi

సాక్షి, చెన్నై : సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంపై సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. వివాదాస్పద టైటిల్‌ వలన సినిమా రిలీజవదని, పబ్లిసిటీ హైప్‌ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు. కులాల పేరుతో టైటిల్స్‌ ఉంటే పర్మిషన్‌ ఇవ్వరని అందుకు ఇటీవల వచ్చిన వాల్మీకి చిత్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ సినిమాలాగా రిలీజ్‌కి ఒక్కరోజు ముందు టైటిల్‌ మారిస్తే సరిపోయేదని సూచించారు. సెన్సార్‌ యాక్ట్‌ సెక్షన్‌ 21 ప్రకారం సినిమాపై కోర్టులో కేసు ఉంటే సర్టిఫికెట్‌ ఇవ్వరని వెల్లడించారు. ఈ నిబంధనను చిరంజీవి సైరా నుంచి అధికారులు ఖచ్చితంగా పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కాకుండా, సినిమాలో కేఏ పాల్‌ పాత్రలేదని వర్మ కోర్టులో ఒక్క డిక్లరేషన్‌ ఇచ్చి ఉంటే సరిపోయేదని అభిప్రాయపడ్డారు.

దీనికి ఉదాహరణగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, లక్ష్మీస్‌ వీరగ్రంథం, సైరా సినిమాలకు తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ వచ్చేదాకా ఆగి ఉంటే ఆ తర్వాత సినిమా విడుదలను ఆపే అధికారం భద్రత పేరుతో ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు. సినిమా రిలీజయ్యాక అందులోని సన్నివేశాలు ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే కేసు పెడతారని, లేదంటే పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు. ఇప్పుడు కేఏపాల్‌ కేసు కోర్టులో ఉంది కాబట్టి తుదితీర్పు వచ్చేదాక, సెన్సార్‌ వాళ్లు సినిమా చూసినా కూడా సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెడతారని వివరించారు. ఇలా కాకుండా సినిమా విడుదలకు ముందే నాలుగు రోజులు టీవీ డిబేట్‌లలో సందడి చేయడం అనేది వాళ్లకు టీఆర్పీ రేటు పెంచడానికే ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు ఈ సినిమా విడుదల కాకూడదని సినీ రంగంలోని కొందరు పెద్దలు పనిచేస్తున్నారని ఆరోపించారు. వీటి ముందు కేఏపాల్‌ సమస్య చాలా చిన్నదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు