వేలూరు కోర్టుకు మురుగన్‌

2 Jan, 2018 19:21 IST|Sakshi

వేలూరు: వేలూరు సెంట్రల్‌ జైలులో సెల్‌ఫోన్‌ ఉపయోగించాడని నమోదైన కేసులో మురుగన్‌ అనే నిందితుడిని మంగళవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది మార్చి 26వ తేదీన జైలు అధికారుల తనిఖీ సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ గదిలో సెల్‌ఫోన్‌ ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. వేలూరు జేఎం -1 కోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నది. ఈనెల 2వ తేదీన నిందితుడిని నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అరక్కోణం డీఎస్పీ కుందలింగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్‌ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి అలిసియా ముందు హాజరుపరిచారు. జైలు వార్డర్‌లు నందకుమార్, పెరుమాల్, బాగాయం ఎస్‌ఐ ప్రభాకరన్‌లను న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేయగా పోలీసులు బందోబస్తు నడుమ మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. కాగా, ఈ కేసులో జైలులోని ఏడుగురు సాక్షులను విచారణ జరపాలని కోరుతూ మురుగన్‌ తరపు న్యాయవాది అరుణ్‌కుమార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు