జైలుకెళ్తారు జాగ్రత్త!

11 Oct, 2017 03:32 IST|Sakshi

డెంగీ దోమల వ్యాప్తిపై 20 వేల మందికి నోటీసులు

 నీటి నిల్వల నిర్మూలనకు 48 గంటల గడువు

గడువు మీరితే ఆరు నెలల జైలుశిక్ష హెచ్చరిక

మురుగునీరు నిల్వ ఉంటే కుదరదంటూ ప్రాణాంతకమైన డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి మంగళవారం ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. ఇక ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ పిలుపునిచ్చారు. డెంగీ నివారణ చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌  కోరారు.


సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా డెంగీ జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. డెంగీ జ్వరాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందికి పైగా డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరగా వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ కొన్నివేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కోయంబత్తూరులో డెంగీ జ్వరాలకు  ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయారు. సేలం జిల్లాలో గత వారం రోజుల్లో 18 మంది మృతి చెందడంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి డెంగీ నివారణ పనులను చేపడుతున్నారు. వ్యాధి నిరోధక కషాయం విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులతో చైతన్యర్యాలి నిర్వహిస్తున్నారు.

అదుపులోకి రాని డెంగీ
ఎన్ని చర్యలు తీసుకున్నా డెంగీ అదుపులోకి రాలేదు. ప్రజల్లో భయాందోళనలు తొలగిపోలేదు. సాధారణ జ్వరం వచ్చినా డెంగీ జ్వరం అనుకుని జడుసుకుంటున్నారు.  రోజుల కొలదీ నిల్వ ఉన్న మంచినీటిలో మాత్రమే డెంగీ దోమ వ్యాప్తిచెందుతుందున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి వాటిని నిర్మూలించాల్సిందిగా సూచించారు. ప్రజల్లో ధైర్యం కలిగించి, దోమలవ్యాప్తిని నివారించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 8వ తేదీన చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

చెన్నై పుదుప్పేట, రాయపేట తదితర ప్రాంతాల్లోని దుకాణాల వద్ద నీరునిలిచిపోయి ఉండడాన్ని గుర్తించారు. అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల్లో నీరు పేరుకుపోయి ఉండడాన్ని గమనించారు. కొన్ని ఇళ్ల ప్రాంగణంలో వాడకం నీరు ప్రవాహానికి నోచుకోకుండా నిలిచిపోయి ఉండగా వారికి జాగ్రత్తలు సూచించారు. ఇలా రాష్ట్రం నలుమూలలా గుర్తించిన 20 వేల మందికి మంగళవారం నోటీసులు జారీచేశారు. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.1 లక్ష జరిమానా తప్పదని హెచ్చరించారు. కాగా డెంగీ వ్యాప్తికి దోహదపడుతున్న 64 మంది నుంచి పూందమల్లి మునిసిపాలిటీ రూ.43వేల జరిమానా వసూలు చేసింది.

పుదుచ్చేరిలో చెత్తవేస్తే రూ.100 జరిమానా
డెంగీ నిరోధకానికి జాగ్రత్తల్లో భాగంగా మంగళవారం పుదుచ్చేరిలో పాదయాత్ర నిర్వహించిన గవర్నర్‌ కిరణ్‌బేడీ రోడ్డులో చెత్తవేసిన వారికి అక్కడికక్కడే రూ.100 జరిమానా విధించారు. పుదుచ్చేరి మంత్రి కందస్వామి డెంగీ జ్వరం అనుమానంతో సోమవారం రక్తపరీక్షలు చేయించుకోగా ఫలితాలు రావాల్సి ఉంది.

ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం
ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజుకు 2 వేల కిలోల నిలవేంబు కషాయాన్ని టామ్‌బాక్స్‌ సంస్థలో తయారుచేయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఈ కషాయాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

జ్వరం సోకగానే నిర్లక్ష్యం చేయకుండా డెంగీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పథకంలో కొత్తగా డెంగీ చికిత్సను కూడా చేర్చినట్లు చెప్పారు. ప్రతి మంగళవారాన్ని డెంగీ నివారణ దినంగా పాటించాలని జిల్లా కలెక్టర్లకు, ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.  డెంగీ నివారణ చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ కోరారు.

ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
డెంగీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మదురై హైకోర్టులో రమేష్‌ అనే వ్యక్తి మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీచేసింది.

మరిన్ని వార్తలు