కోవిడ్‌ చికిత్స తీసుకుంటూ పరీక్షలు రాసిన విద్యార్థి

12 Apr, 2020 09:10 IST|Sakshi

చెన్నై: ఆస్పత్రిలో కరోనా వ్యాధికి చికిత్స తీసుకుంటూనే విజయవంతగా ఆన్‌లైన్‌లో తన పరీక్షలను, యూనివర్సిటీకి చెందిన రెండు అసైన్‌మెంట్లను పూర్తి చేసింది ఓ విద్యార్థిని. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ యువతి విదేశంలో ఉన్నత చదువులు చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఇండియాకు వచ్చేసింది. మొదట ఢిల్లీ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి చెన్నై చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోగా కరోనా నెగిటివ్‌ వచ్చింది. ఇంటికి వచ్చి సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంది. మూడు రోజుల తర్వాత తనతో పాటు వచ్చిన స్నేహితులకు పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. తనలో ఎలాంటి లక్షణాలు కనపడకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి వెళ్లి మరోసారి టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. (24 గంటల్లో 1035 కేసులు)

మార్చి 16న ప్రభుత్వ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేరింది. తల్లిదండ్రులను, బంధువులనూ ఎవరినీ కలిసే అవకాశం లేదు. ఇదే సమయంలో తన యూనివర్సిటీలో ఇది పరీక్షల సమయం. ఎలాగైనా పరీక్షలను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్‌లో రెగ్యులర్‌గా క్లాస్‌లను వింటూ పరీక్షలకు సన్నద్ధమైంది. చివరికి నాలుగు పరీక్షలను ఆన్‌లైన్‌లోనే రాసింది. కరోనా నుంచి బయటపడుతూ వచ్చింది. చివరికి తన రెండు ఆరోగ్య పరీక్షల్లోనూ నెగిటివ్‌ రావడంతో ఈనెల 6న డిశ్చార్జ్‌ అయ్యింది. తన ఇంటికి వెళ్లే రోజు ఆస్పత్రి నుంచే ఇంటర్నిషిప్‌ కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది. రెండు వారాలు ఇంటికి దూరంగా ఉండడంతో ఎలాంటి డిప్రెషన్‌కు లోనుకాకుండా ఉండేందుకు ఆస్పత్రిలోనే తాను పరీక్షలపై దృష్టి సారించానని ఆమె తెలిపారు. 

మరిన్ని వార్తలు