శిలగా మారుతుందని.. 

4 Jul, 2018 00:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మూఢ నమ్మకాలు మనిషిని  ప్రభావితం చేస్తాయనడానికి తమిళనాడులో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది. పుట్టినరోజు నాడు చిన్నారి శిలగా మారుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు వందలాదిమంది పూజలు చేస్తూ ఆ సంఘటన కోసం ఎదురు చూశారు. చివరకు అలా జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా మనమేల్‌కుడికి చెందిన పళని కుమార్తె మాసిల (12) ఆరోతరగతి చదువుతోంది. ఈ చిన్నారికి దైవభక్తి ఎక్కువ. త్వరలో తాను సన్యాసిని, స్వామిని కాబోతున్నానని తరచూ చెప్పుకునేది. అయితే ఆమె తల్లిదండ్రులు కుమార్తె మాటలను పెద్దగా పట్టించుకోకున్నా ఒక కంట కనిపెట్టసాగారు. వయసుకు మించిన మాటలాడుతున్న మాసిలను ఓ జ్యోతిష్యుని వద్దకు తీసుకెళ్లి జాతకం చూపించగా ‘12వ జన్మదినం రోజున చిన్నారి మాసిల ఒక శిలావిగ్రహంగా మారిపోతుంది’ అని చెప్పాడు.

ఈ నెల 2న మాసిల 12వ జన్మదినం కావడంతో ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికకు పట్టుచీర కట్టి నిండుగా పూలతో అలంకరించారు. వడకూర్‌ అమ్మన్‌ ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. రాత్రి పోద్దుపోతున్నా ఎంతసేపటికీ చిన్నారి మాసిల శిలగా మారలేదు. దీంతో ఆలయ పూజారి మాసిలకు, ఆమె తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టి పంపివేశాడు.  

మరిన్ని వార్తలు