‘అమ్మ’ను హల్వా తినిపించి చంపేశారు

7 Mar, 2019 08:11 IST|Sakshi

తమిళనాడు మంత్రి సీవీ షణ్ముగం 

జయలలితది ముమ్మాటికి హత్యేనని స్పష్టీకరణ

సాక్షి, చెన్నై: జయలలిత మృతి విషయంలో మరోమారు తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హల్వాను తినిపించి మరీ జయలలితను చంపేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యే అని విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ విచారణలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్‌ ఇచ్చిన వాంగ్మూలం, నివేదికలపై న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తీవ్రంగానే విరుచుకుపడ్డారు.

అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్‌ వ్యవహరిస్తున్నారని, ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త ఐఏఎస్‌లు, మంత్రుల మధ్య వ్యాఖ్యల సమరానికి దారి తీసింది. ఈనేపథ్యంలో జయలలిత మరణం విషయంలో సీవీ షణ్ముగం మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో షణ్ముగం ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో స్లో పాయిజన్‌గా తీపి వస్తువుల్ని ఇవ్వడం మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రధానంగా హల్వాను అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జయలలితకు మధుమేహం ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని, చివరి క్షణంలో గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి మారే రీతిలో హల్వా తినిపించినట్లు ఆరోపించారు. 

మరిన్ని వార్తలు