నల్ల కోటు.. ఖరీదైన ఓటు

3 Feb, 2018 05:26 IST|Sakshi

ఓటుకు రూ.30 వేలు

బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో భలే భేరం

ఆర్కేనగర్‌ ఎన్నికలను తలపిస్తోందని న్యాయమూర్తుల వ్యాఖ్య

మార్చి 28న పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ కావచ్చు.. పార్లమెంటు.. కావచ్చు ఏ ఎన్నికలైనా కరెన్సీ కట్టలు కట్టలుగా ఖర్చుకావాల్సిందే. అయితే ఈరకమైన కరెన్సీ కట్టల భాగోతం ప్రస్తుతం బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సైతం చొరబడింది. ‘నల్లకోటు’ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.30 వేలు పలుకుతున్నట్లు సమాచారం. తమిళనాడు, పుదుచ్చేరి బార్‌ కౌన్సిల్‌కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఓటుకు నోటుపై విజయనారాయణన్‌ అనే న్యాయవాది మదురై హైకోర్టు శాఖలో శుక్రవారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు కృపాకరన్, ధరణి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలను మించిపోయినట్లుగా భావించాల్సి వస్తున్నదని వారు వ్యాఖ్యానించారు.

స్వేచ్ఛగా నగదు చలామణిపై అవసరమైన ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘాపెట్టి కరెన్సీని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సక్రమంగా జరగలేదని పిటిషన్‌ వేసే న్యాయవాదులే నేడు నగదు చలామణికి సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరు ఎవరిని తప్పుపడతారని ప్రశ్నించారు. పదవి, అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశ రాజకీయ నేతల్లో  పెరిగిపోవడంతో నోటును విసిరి ఓటును పట్టుకుంటున్నారు, ఇది మన కళ్ల ముందు అనాథిగా కనపడే సత్యమని అన్నారు. అయితే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సైతం రాజకీయపార్టీల విధానం అలవడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 230 న్యాయవాదుల సంఘాలు ఉండగా, అన్ని సంఘాలు 1961లో ఏర్పడిన మద్రాసు హైకోర్టులోని బార్‌ కౌన్సిల్‌ పరిధిలోకే వస్తాయి. ఎంతో అధికారంతో కూడిన పదవి కావడంవల్లనే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు రానురానూ ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. మద్రాసు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు,  ఉపాధ్యక్షుడు అఖిలభారత బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. బార్‌ కౌన్సిల్‌లో ఓటున్న న్యాయవాదులు ముందుగా 25 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఈ 25 మంది సభ్యులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎంపికైన 25 మందిలో 13 మంది సభ్యులు ఎవరివైపు ఉంటారో అతనే అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఆ తరువాత ఒక సాధారణ న్యాయవాదిగా చలామణి కాడు. అతనికంటూ ఒక పెద్ద కార్యాలయం, కింద పనిచేసే సిబ్బంది ఉంటారు.

న్యాయవాదుల మధ్యలో బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడికి లభించే గౌరవమర్యాదలే ప్రత్యేకంగా ఉంటాయి. గౌరవం మాత్రమే కాదు గొప్ప అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం, న్యాయమూర్తులుగా ఎన్నికైన వారికి సచ్చీల సర్టిఫికెట్‌ జారీచేసే అధికారం ఉంటుంది. బార్‌ కౌన్సిల్‌లో చేర్చుకోవడం, నిరాకరించే అధికారాలు కూడా ఉంటాయి. న్యాయవాదులు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సహకారం చెల్లించడం అధ్యక్షుని చేతుల్లోనే ఉంటుంది. ఇంతటి అధికారాలు, గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టే పోటాపోటీగా నోట్లు వెదజల్లైనా ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధం అవుతున్నారు. రెండేళ్ల క్రితం జరగాల్సిన ఎన్నికలను వాయిదావేస్తూ పోతుండడంతో కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. వెంటనే ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీచేయడంతో వచ్చేనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పర్యవేక్షణలోనే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగుతున్నందున అక్రమాలు చోటుచేసుకుంటే వేటు తప్పదనే భయం కూడా సభ్యుల్లో ఉంది.

మరిన్ని వార్తలు