మోక్షం కోసం మహిళ ఆత్మాహుతి

11 Jan, 2018 08:26 IST|Sakshi

శ్రీరంగంలో ఘటన 

సాక్షి, టీ.నగర్‌(చెన్నై): మూఢభక్తితో ఓ మహిళ ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో సంచలనం కలిగించింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన వివరాలు.. శ్రీరంగం సాత్తారవీధికి చెందిన సత్యనారాయణ నగరాభివృద్ధి కార్యాలయ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ఏడేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన భార్య పట్టమ్మాళ్‌(85). ఆదివారం వైకుంఠ ఏకాదశి ముగింపు సందర్భంగా నమ్మాళ్వార్‌ మోక్షసిద్ధి కార్యక్రమంలో పాల్గొంది.

అనంతరం ఇంటికి వచ్చిన పట్టమ్మాళ్‌ స్నేహితురాలు రాజ్యలక్ష్మికి ఆధార్, రేషన్‌ కార్డు ఇతర పత్రాలను అందజేసింది. సోమవారం ఉదయం పట్టమ్మాళ్‌ ఇంటికి వెళ్లిన రాజ్యలక్ష్మి తలుపు తట్టినప్పటికీ తెరవలేదు. కిటికీ నుంచి తొంగిచూసిన ఆమెకు లోపల పట్టమ్మాళ్‌ శరీరం కాలుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి పట్టమ్మాళ్‌పై నీళ్లు పోశారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిసి కోయంబత్తూరులోని బంధువులకు సమాచారం ఇచ్చారు.

సమాచారంతో అక్కడికి వచ్చిన శ్రీరంగం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీరంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మంగళవారం బంధువులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు రాజ్యలక్ష్మి, ఇరుగుపొరుగువారి దగ్గర ప్రాథమిక విచారణ జరపగా నమ్మాళ్వార్‌ మోక్షసిద్ధి పొందేరోజున ఎవరైనా చనిపోతే మోక్షం పొందుతారని పట్టమ్మాళ్‌ తరచూ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు