బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌.. ధరెంత?

18 Sep, 2017 13:19 IST|Sakshi
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌.. ధరెంత?
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌ ప్రకటనాంతరం టెలికాం దిగ్గజాలు ఒక్కోటి ఫోన్ల మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవలే జియోఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుపగా... తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేయబోతుందట.‍ దీనికోసం దేశీయ మొబైల్‌ డివైజ్‌ తయారీదారులు లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. 2000 రూపాయల ధరలో, అన్ని ఉచిత ఆఫర్లతో అక్టోబర్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించబోతుందని వెల్లడైంది. 
 
లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి డివైజ్‌ తయారీదారులతో కలిసి సొంత మోడల్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ అనుపమ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఫోన్లు మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత వాయిస్‌ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తాయన్నారు. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్టు తెలిపారు. ఈ డివైజ్‌ ధర కూడా 2000 రూపాయలు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ 10.5 కోట్ల సబ్‌స్క్రైబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రెండు కంపెనీలు కో-బ్రాండెడ్‌ డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ పూర్తిగా కుదుపులకు లోనుకానున్నట్టు తెలుస్తోంది.
 
ఓ వైపు జియో ఫోన్‌, మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లు.. వీటితో తీవ్ర పోటీ నెలకొనబోతుంది. ఫీచర్‌ఫోన్ల ద్వారా వస్తున్న రెవెన్యూలు 15 శాతం ఉండగా.. ఈ డివైజ్‌లు మార్కెట్‌లో 50 శాతం స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఇటీవల వెల్లడైన రిపోర్టుల ప్రకారం 85 శాతం ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లలోకి మారడానికి సిద్ధంగా లేనట్టు తెలిసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌ లాంచింగ్‌పై లావా కానీ, మైక్రోమ్యాక్స్‌ కానీ స్పందించలేదు. 
మరిన్ని వార్తలు