వాట్సాప్‌లోకి ఆ ఫీచర్‌ వచ్చేస్తోంది...

13 Sep, 2017 15:10 IST|Sakshi
వాట్సాప్‌లోకి త్వరలో ఆ ఫీచర్‌..
శాన్‌ఫ్రాన్సిస్కో : పొరపాటును ఎవరికైనా వాట్సాప్‌లో మెసేజ్‌ కానీ వీడియో కానీ పంపారా? అయ్యో పొరపాటున పంపామే మళ్లీ వెనక్కి తీసుకోవడం ఎలా? అని దిగాలు చెందుతున్నారు. ఇప్పుడు అలాంటి దిగులే అవసరం లేదు. వాట్సాప్‌ ఎంతో కాలంగా వేచిచూస్తున్న ''అన్‌సెండ్‌'' ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతుంది. యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం కొత్త ఫీచర్స్‌ను వాట్సాప్‌ టెస్ట్‌ చేసిందని, వాటిలో ''డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌'' అనే ఫీచర్‌ను ఎట్టకేలకు ఈ మెసేజింగ్‌ యాప్‌ టెస్ట్‌ చేసిందని తెలిపింది. డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ అనే ఫీచర్‌ను వాట్సాప్‌ తన సర్వర్లలో ఎనేబుల్‌ కూడా చేసిందని, త్వరలోనే దీన్ని యూజర్లకు తీసుకొస్తున్నారని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఓ ట్వీట్‌లో పేర్కొంది. 
 
ఈ ఫీచర్‌తో యూజర్లు టెక్ట్స్‌లను, ఇమేజ్‌లను, వీడియోలను, జీఐఎఫ్‌లను, డాక్యుమెంట్లను, స్టేటస్‌ రిప్లేలను ఐదు నిమిషాల విండోలో రీకాల్‌ చేసుకోవచ్చు. అయితే మెసేజ్‌లను లేదా మరే ఇతర వాటినైనా పంపించి ఐదు నిమిషాలు దాటినా.. పంపిన వాటిని అవతలి వ్యక్తి చదివినా ఈ ఫీచర్‌తో రీకాల్‌ చేయడం కుదరదు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నింటికీ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. రీకాల్‌ చేసే ఫీచర్‌తో పాటు, పంపిన మెసేజ్‌లను ఎడిట్‌ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ బీటా వెర్షన్లకు తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాజా మెసేజ్‌లను మాత్రమే ఎడిట్‌ చేసుకునే వీలుంటుంది. పాత వాటిని ఎడిట్‌ చేయలేరు. వాట్సాప్‌కు ఇప్పటికే నెలకు 1.2 బిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా లాంగ్వేజ్‌లకు ఇది అందుబాటులో ఉంది. 10 భారతీయ భాషలకు ఇది సపోర్టు చేస్తోంది. 
మరిన్ని వార్తలు