జియో ఫోన్‌ డెలివరీ ఆలస్యం?

31 Aug, 2017 19:28 IST|Sakshi
జియో ఫోన్‌ డెలివరీ ఆలస్యం?
సాక్షి, ముంబై :  అనుకున్న తేదీలోనే జియో ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఆగస్టు 24నే కంపెనీ ఈ ఫోన్‌ బుకింగ్స్‌ను చేపట్టింది. అంచనాల కంటే అధికంగానే వినియోగదారుల నుంచి స్పందన కూడా వచ్చింది. 3 మిలియన్‌ నుంచి 4 మిలియన్‌ యూనిట్ల వరకు బుక్‌ అయ్యాయి. వినియోగదారుల నుంచి స్పందన అనూహ్యంగా ఉండటంతో, ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్‌ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీని కూడా కంపెనీ జాప్యం చేయనున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జియో ఫోన్‌ ఎప్పుడెప్పుడు తమ చేతిలోకి వస్తుందా? అంటూ ఎదురుచూస్తున్న వినియోగదారులు, ఈ ఫోన్‌ కోసం మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందేనట.
 
డిమాండ్‌ విపరీతంగా రావడంతో, డెలివరీ తేదీలు ఆలస్యమయ్యే అవకాశముందని రిటైలర్లు చెప్పినట్టు ఇండియా టుడే టెక్‌ రిపోర్టు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్‌ తెలిపారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేసిస్‌లో ఈ ఫోన్లను అందిస్తామని జియో అంతకముందే చెప్పింది.  ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్‌ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది. 
 
మరిన్ని వార్తలు