మోస్ట్‌ హాక్‌-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ ఇదేనట!

3 May, 2017 09:16 IST|Sakshi
మోస్ట్‌ హాక్‌-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ ఇదేనట!

హ్యాకింగ్‌ భయాలతో ఆందోళన చెందుతున్నస్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు శుభవార్త. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెకఫే  ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుంది. మోస్ట్‌ హాక్‌-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ను  తయారుచేసే ప్రణాళికలను ఆయన ఇటీవల ట్విట్టర్ లో  వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. ‘న్యూస్‌వీక్’ వెబ్‌సైట్‌ తో  మాట్లాడిన మెకఫే సంస్థ వ్యవస్థాపకుడు జాన్ మెకఫే ప్రపంచంలోనే తొలి పూర్తి ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్  ఇదేనని  కూడా  ప్రకటించారు. 

‘జాన్ మెకఫే ప్రైవసీ ఫోన్’ పేరుతో ఈ ఏడాదే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మెకఫే చెప్పారు.  అయితే ఇది సాధారణ వినియోగదారుల కోసం కాదట... వ్యాపారవేత్తలు, సమాచార భద్రత కోరుకునే వారి కోసం దీన్ని తయారుచేశామన్నారు. ఇక ధర విషయానికి వస్తే  సుమారు రూ. 65వేలు (1000 డాలర్లు) ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి ట్రూలీ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ అని జాన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైవసీ స్మార్ట్‌ఫోన్  ఫొటోను షేర్‌ చేశారు.

డెన్మార్క్‌లో డిజైన్‌ చేసి, అమెరికాలో  డెవలప్‌ చేసి, యూరోప్‌లో అసెంబుల్డ్‌ చేసిన ఈ స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ను  ఎంజీటీ, మెకఫే సంస్థలు సంయుక్తంగా  తయారుచేస్తునట్టు వివరించారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాత్రం  వెల్లడించలేదు.  దీని అఫీషియల్‌ లాంచింగ్‌ ముందు పూర్తి వివరాలు  ప్రకటిస్తామన్నారు.  ఈ  డివైస్‌ హార్డ్‌వేర్‌ భద్రత అంశంలో కీలక ప్రాత పోషించనుందన్నారు.  "హార్డ్‌వేర్  భద్రతకు మూలం..సాప్ట్‌వేర్‌ అభద్రతకు ఆధారం అన్నట్టుగా ట్వీట్‌ చేశారు.

కాగా యూజర్ల డేటాను రక్షించేందుకు ఆపిల్‌, గూగల్  ఆపరేటింగ్‌ సిస్టం ప్రైవసీ పద్దతులను పాటిస్తోంటే..మరి ఈ మెకఫీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో ఇంకా రివీల్‌ కావల్సి ఉంది.

మరిన్ని వార్తలు