క్లీనింగ్‌ షాండ్లియర్‌

22 Sep, 2017 02:04 IST|Sakshi
క్లీనింగ్‌ షాండ్లియర్‌

ఇది టూ ఇన్‌ వన్‌. రాత్రిపూట వెలుగులు చిమ్మే షాండ్లియర్‌. మిగిలిన సమయమంతా ఓ ఎయిర్‌ ప్యూరిఫయర్‌! లండన్‌కు చెందిన డిజైనర్, ఇంజనీర్‌  జూలియాన్‌ మిచిరీరి తయారు చేశాడు దీన్ని. షాండ్లియర్‌ వరకూ ఓకే గానీ.. ఇది గాలినెలా శుభ్రం చేస్తుంది? మన చుట్టుపక్కల పాత చెరువో, బావో ఉంటే అక్కడ మీకు పచ్చగా నాచు కనిపిస్తుంది తెలుసుగా. దాన్నే ఇంగ్లిష్‌లో ఆల్గే అంటారు. అతిసూక్ష్మస్థాయిలో ఉండే మొక్కలన్నమాట ఇవి. మొక్కలకు ఉండే సహజ లక్షణం వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చేసుకుని ఆక్సిజన్‌ను వదలడం. షాండ్లియర్‌లోనూ ఇదే జరుగుతుంది.

ఆకుల్లాంటి నిర్మాణాల్లో ప్రత్యేకమైన బ్లూగ్రీన్‌ ఆల్గేను పెంచుతున్నారన్నమాట. బయోకెమికల్‌ టెక్నాలజీలో పరిశోధనలు కూడా చేస్తున్న జూలియన్‌ పర్యావరణానికి మేలు చేసే లక్ష్యంతో ఈ షాండ్లియర్‌ను రూపొందించాడట. ప్రస్తుతానికి ఇదో నమూనా మాత్రమే. లండన్‌ డిజైన్‌ వీక్‌లో భాగంగా వీ అండ్‌ ఏ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. కానీ తాను అభివృద్ధి చేసిన ఫొటో రియాక్టివ్‌ సెల్‌ టెక్నాలజీ సాయంతో భవిష్యత్తులో ఇలాంటి వాటిని భవనాలన్నింటిలోనూ ఏర్పాటు చేసుకోగలిగితే వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదును తగ్గించవచ్చునని అంటున్నాడు జూలియన్‌.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు