‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!

21 May, 2017 07:40 IST|Sakshi
‘వాన్నక్రై’కి వచ్చింది రూ. 53 లక్షలేనా!

ప్రపంచంలో గత వారం రోజులుగా ‘వాన్నక్రై రాన్సమ్‌వేర్‌’  వైరస్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే ఈ దాడిలో సైబర్‌ నేరస్థులు లాభపడింది మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటివరకు 82 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 52.85 లక్షలు) మాత్రమే నేరస్థులకు చేరినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు. ఈ సైబర్‌ దాడికి బాధ్యులైన వారిని కూడా త్వరలో పట్టుకోగలమని చెబుతున్నారు. గతంలో జరిగిన ‘కిప్టోవాల్‌’ సైబర్‌ దాడిలో నేరస్థులు 32.5 కోట్ల డాలర్లు ఆర్జించారు.

సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినంత వరకు ‘వాన్నక్రై’ కచ్చితంగా నేరమే. వైరస్‌ ద్వారా ఫైళ్లను తమ నియంత్రణలో ఉంచుకొని అడిగినంత డబ్బు చెల్లిస్తేనే రహస్య ఎన్‌క్రిప్షన్‌ కీ ద్వారా విడుదల చేస్తున్నందున ఇది నేరమేనని అంతర్జాతీయ సైబర్‌ నిఘా ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. బ్యాకప్‌ ఫైళ్లకు అవకాశం లేని వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులనే ఎక్కువగా టార్గెట్‌ చేయడం వల్ల వాన్నక్రై నేరస్థులకు వాళ్లు ఆశించినంత ఎక్కువ డబ్బు ముట్టలేదట. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య స్కీమ్‌కు సంబంధించిన అతిపెద్ద నెట్‌వర్క్‌ను టార్గెట్‌ చేసినా, బ్యాకప్‌ ఫైళ్లు తమకు అవసరం లేదని నిర్వాహకులు వదిలేయడం వల్ల కూడా నేరస్థులు పెద్దగా లాభపడలేదు. డబ్బులు ఎక్కడి నుంచి ఎలా బదిలీ అవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అంతిమంగా ఎక్కడికి చేరుతాయో గుర్తించడం ద్వారా నేరస్థులను అరెస్ట్‌ చేయగలమని అంతర్జాతీయ సైబర్‌ నేరాల పరిశోధన సంస్థలు తెలియజేస్తున్నాయి.

మరిన్ని వార్తలు