రూ.1500కే ఫీచర్‌ ఫోన్‌

2 May, 2017 11:19 IST|Sakshi
రూ.1500కే 4జీ ఫీచర్‌ ఫోన్‌

న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలో 4జీ ఫోన్ సొంతం చేసుకోవాలని కలలు కంటున్నారా? అయితే త్వరలోనే మీ కలనెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాసెసర్లను తయారు చేసే  చైనాకు  చెందిన ఒక సంస్థ అతిసరసమైన ధరలో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి  తేవాలని యోచిస్తోంది.  

ఎకనామిక్స్‌ టైమ్స్‌  అందించిన సమాచారం ప్రకారం  చైనీస్ మొబైల్ చిప్ తయారీదారు  ఈ మేరకు భారీ కసరత్తు చేస్తోంది.   ఫీచర్‌ ఫోన్‌ ధరలను ప్రస్తుత స్థాయిలనుంచి కనీసం సగం ధరలను తగ్గించేవైపుగా పని చేస్తోంది.  ఈ మేరకు రూ.1500 లకే 4జీ ఫోన్‌ను అందించ నుంది. స్ప్రెడ్‌ట్రమ్ కమ్యూనికేషన్స్‌ అని పిలిచే ఈ కంపెనీ హెడ్‌  నీరజ్ శర్మను ఉటంకిస్తూ ఈ విషయాన్ని  రిపోర్ట్‌ చేసింది.   ఇప్పటికే తన భాగస్వాములతో కలసి కాన్సెప్ట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిందని తెలిపింది.

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో రెండేళ్ల భాగస్వామ్యంలో భాగంగా  స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌ తో  అతి తక్కువ ధరలో ఎల్‌ వైఎఫ్‌  ఫ్లేమ్‌ 5 ఫోన్లను రూపొందించింది. అలాగే లావాతో లావా ఎంఐ 4జీ ఆధారిత ఫీచర్‌పోన్‌ కూడా తీసుకొచ్చింది.

మరోవైపు మార్కెట్‌ సంచలనం రిలయన్స్‌ జియోకూడా  రూ.1500 4జీ ఫోన్‌ను అందించనున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ అయినప్పటికీ  స్మార్ట్‌ఫోన్ రూపంలో కాకుండా ఫీచర్ ఫోన్ రూపంలో దీన్ని తయారు చేయనున్నారు. అంటే ఆ ఫోన్లలో  టచ్ కు బదులుగా కీ ప్యాడ్‌ను వాడుకోవాల్సి ఉంటుందనీ, అయితే  4జీ వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఫీచర్ ఫోన్ల యూజర్ల సంఖ్య దాదాపుగా 39 కోట్లను దాటేసినట్టు అంచనా.  
 

మరిన్ని వార్తలు