1.20 కోట్ల మొక్కలు నాటుతాం

10 Apr, 2015 03:16 IST|Sakshi

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న

ఆత్మహత్యలు ఆగాలంటే అడవులను కాపాడాలి
‘పోడు’ పదెకరాల కంటే ఎక్కువ ఉంటే స్వాధీనం
రైతులు, పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం

 
మూడేళ్లలో 1.20 మొక్కలు నాటుతామని అటవీశాఖ మాత్యులు రామన్న అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా భూపాలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను స్పీకర్ మధుసూదనాచారితో కలిసి ఆయన ప్రారంభించారు.
 
భూపాలపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మూడేళ్లలో 1.20 కోట్ల మొక్కలు నాటుతామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నందిగామ, దీక్షకుంట, గొల్లబుద్ధారం, చికెన్‌పల్లి గ్రామాల శివారులోని చెరువుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి రామన్న, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిగామలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడారు. హరితహారం పథకం కింద ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటుం దని రైతులు అపోహ చెందవద్దన్నారు. జానెడు పొట్ట నింపుకోవడం.. బతుకు దెరువు కోసం అటవీ భూములను పోడు చేసుకున్న రైతుల జోలికి తాము వెల్లబోమని ఆయన పేర్కొన్నారు.

అడవులను కాపాడితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని.. తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పదెకరాల లోపు సాగు చేసుకుంటున్న రైతులకు అడ్డు తగలవద్దని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పాడన్నారు. పోడు చేసుకున్న రైతులు తమ భూమిలో కొంతభాగం ఉసిరి, తాటి, ఈత, నీలగిరి లాంటి పండ్లు, పూలనిచ్చే మొక్కలు పెంచాలని సూచించారు.

దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించడమేకాక మొక్కలను పెంచినట్లు అవుతుందన్నారు. జిల్లా భూవిస్తీర్ణం 12,80,100 హెక్టార్లు కాగా.. ఇందులో 2,36,128 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉందన్నారు. అయితే ఇప్పటికే సుమారు 50 నుంచి 60 హెక్టార్లలో పోడు జరిగిందన్నారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని ఉద్యమం చేసిన రైతులు, పేదలు సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు అడవులను సంరక్షించి వాతావరణ సమతుల్యతను కాపాడాలని మంత్రి సూచించారు.

నిధుల కేటారుుంపులో వివక్ష : స్పీకర్

సీమాంధ్ర పాలకులు నీటిపారుదల వ్యవస్థను మూడు ముక్కలుగా విడగొట్టి తెలంగాణ ప్రాంతంలోని చిన్ననీటి పారుదలపై వివక్ష చూపి తక్కువ నిధులు కేటాయించారని శాసన సభాపతి, ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఫలితంగా తెలంగాణ చెరువులు, కుంటలు 50 ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోక సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పదెకరాల లోపు అటవీ భూమిని పోడు చేసుకున్న వారి జోలికి వెళ్లబోమని మంత్రి రామన్న ప్రకటించినందుకు స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య, అటవీ శాఖ పీసీసీఎఫ్ ఎస్‌బీఎల్ మిశ్రా, అడిషనల్ పీసీసీఎఫ్ సునీల్‌కుమార్ గుప్తా, వరంగల్ సోషల్ ఫారెస్ట్రీ కన్జర్వేటర్ పీవీ రాజారావు, వివిధ డివిజన్ల డీఎఫ్‌ఓ, సబ్ డీఎఫ్‌ఓలు, ఐబీ ఎస్‌ఈ పద్మారావు, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, నాయకులు కుంచాల సదావిజయ్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, కూచన వేణు, తాళ్లపెల్లి శశికాంత్, రాంపూర్ వెంకన్న పాల్గొన్నారు.

హరితహారాన్ని విజయవంతం చేయూలి

గణపురం : రాష్ట్రంలో హరితహారం విజయవంతానికి సమష్టిగా కృషి చేయూలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. చెల్పూరు శివారులోని కేటీపీపీలో గల గోదావరి అతిథి గృహంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జూలైలో తొలకరి వర్షాలు పడగానే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా మొక్కలు నాటుతామని అన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు, నియోజకవర్గంలో పది లక్షల మొక్కలు లక్ష్యంగా నిర్ణరుుంచామన్నారు. ప్రతి వ్యక్తి పొలం, లేదా ఇంటి ఆవరణలో తప్పక మొక్కలు నాటాలని అన్నారు. పాఠశాలు, మసీదులు, చర్చిలు, చెరువులు, కట్టలు, బీడు భూములు ఉన్న చోట మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు.

జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి అన్ని శాఖలను సమన్వయపరిచి హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. దీనికి అటవీ శాఖలోని కింది స్థాయి అధికారుల కృషి ముఖ్యమని అన్నారు. అలాగే మేడారంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఎస్‌బీఎల్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఎస్‌కే గుప్తా, కలెక్టర్ వాకాటి కరుణ, సీఎఫ్ రాజారావు, డీఎఫ్‌ఓలు పి.రమేష్, భీమానాయక్, ముకుందరెడ్డి, గంగారెడ్డి, కిష్ణగౌడ్, వెంకటేశ్వర్లు, ఏసీఎఫ్‌లు, ఎఫ్‌ఆర్‌ఓలు, డిప్యూటీ రేంజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు