1248 అదనపు ఉద్యోగాలు

22 Jul, 2017 01:13 IST|Sakshi

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం అమలు కోసం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులలో రూ.1,533కోట్లు ఖర్చు చేసేం దుకు స్టేట్‌ హెల్త్‌ సొసైటీ అనుమతులు తీసుకుంది. ఇందులో భాగంగా 50 పడకల మాతా శిశు వైద్యశాలలను మరో ఐదింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం అమలు కోసం వివిధ కేటగిరీల్లో 1,248 ఉద్యోగాల కల్పనకు అంగీకరించింది. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన స్టేట్‌ హెల్త్‌ సొసైటీ కార్యనిర్వాహణ కమిటీ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద గతేడాది రూ.532.86 కోట్లు, ఈ ఏడాది రూ.1,000 కోట్లు కలిపి మొత్తంగా రూ.1,532.88 కోట్లను ఖర్చు చేసేందుకు సొసైటీ అనుమతులు తీసుకుంది. రూ.10 కోట్లతో లేబర్‌ రూమ్స్‌ ఆధునీకరణ, రూ.8.5 కోట్లతో 3 హైడిస్పెన్సరీ యూనిట్లు, 2 ఓఐసీయూలను నెలకొల్పాలని సమావేశంలో నిర్ణయించారు. అమ్మ ఒడి కింద ఇప్పటికే 40 వాహనాలు ఉండగా.. భవిష్యత్‌ అవసరాల కోసం మరో 200 కొనుగోలు చేయనున్నారు. వ్యాధుల నివారణకు జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 31 జిల్లా కేంద్రాల్లో సమగ్ర వ్యాధుల నిరోధక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు: పిల్లల ఆరోగ్య పరిరక్షణకు నిలోఫర్‌ ఆస్పత్రిలో 12 కంగారూ మదర్‌ కేర్‌ యూనిట్లు, 22 డయాలసిస్‌ యూనిట్లు, 12 డీఈఐసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకులు, 10 వేల మంది పిల్లలకు న్యూ బార్న్‌ స్క్రీనింగ్‌లు చేయాలని, అలాగే 7 ఎస్‌ఎన్‌సీయూలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  
వ్యాధుల నిర్ధారణలో ఐసీఎంఆర్‌ సహకారం: అసంక్రామిక వ్యాధుల (ఎన్‌సీడీ) నిర్ధారణలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సహకారం రాష్ట్రానికి అందిస్తామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమైన ఐసీఎంఆర్‌ ప్రతినిధుల బృందం.. గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులను ముందే గుర్తించే వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ చాలా ముందుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు