ఆది మందిరం!

14 Sep, 2017 02:05 IST|Sakshi

రాష్ట్రంలో 1,300 ఏళ్ల నాటి అద్భుత జైన కట్టడం
►  65 అడుగుల ఎత్తులో, ఇటుకలతో నిర్మితం
జడ్చర్ల సమీపంలో ఉందీ అద్భుతాలయం
►  గొప్ప పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం
శిథిలావస్థకు చేరి కునారిల్లుతున్న వైనం
►  ప్రభుత్వం పట్టించుకోకుంటే కనుమరుగే
►  ఏఎస్‌ఐకి ఇవ్వాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగే
 ఇలాంటి మందిరాన్ని యూపీలో పునర్నిర్మించిన ఏఎస్‌ఐ
►  దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న వైనం


ఇదీ ఇటుకలతో నిర్మితమైన మందిరమే. అతి పురాతనమైనదే. క్రీస్తుశకం 8వ శతాబ్ది చివర్లో రాష్ట్రకూటుల కాలంలో నిర్మితమైన జైన మందిరమిది. అంటే 1,300 ఏళ్ల నాటిది. 65 అడుగుల ఎత్తుతో నేటికీ ఇలా నిలిచిన ఈ మందిరం జడ్చర్లకు 9 కి.మీ. దూరంలో గంగాపురం శివారులో ఉంది. స్థానికులు దీన్ని గొల్లత్తగుడిగా పిలుచుకుంటారు. ఈ రెండు ఆలయాలూ దాదాపు ఒకేలా ఉన్నాయి కదూ. దేశంలో ప్రస్తుతం మిగిలి ఉన్న అతి పురాతన ఇటుక మందిరాలు ఈ రెండేనన్నది పురావస్తు శాఖ మాట. నిర్మాణ నేర్పు రెండు మందిరాల్లోనూ ఒకేలా ఉంది. ఏ మిశ్రమంతో జోడించారో గానీ... సూది మొన మోపేంతైనా సందు లేకుండా నేర్పుగా పేర్చిన భారీ ఇటుకల దొంతరలు వెయ్యేళ్లు దాటినా ఇంకా పటిష్టంగానే నిలిచి ఉన్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: 13 శతాబ్దాలుగా ఎన్నో ప్రాకృతిక విపత్తులకు ఎదురొడ్డి నిలిచిన ఈ ఇటుకల అద్భుతం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని దుస్థితిలో ఉందిప్పుడు. తెలంగాణవ్యాప్తంగా కాకతీయుల కాలంలో అద్భుతమైన రాతి గుళ్లు వెలిశాయి. కానీ అంతకుపూర్వం నిర్మితమైన ఆలయాల జాడ మన రాష్ట్రంలో అతి స్వల్పం. అందులోనూ ఇటుకలతో నిర్మితమైన మందిరాలు లేవు. నాలుగో శతాబ్దంలో నేలకొండపల్లి, ఫణిగిరి, నాగార్జునసాగర్, కీసరగుట్ట వంటి ప్రాంతాల్లో నిర్మితమైన బౌద్ధ స్తూపాలే ఇందుకు మినహాయింపు. కానీ గంగాపూరం శివారులో ఉన్న ఈ ఆలయ పరిరక్షణకు మాత్రం ప్రభుత్వపరంగా ఇప్పటిదాకా ఎలాంటి కసరత్తూ జరగలేదు. నిర్మాణ పటుత్వం వల్ల ఇప్పటికీ ఇలా నిలిచి ఉంది గానీ లేదంటే ఈ పాటికి ఆనవాళ్లు కూడా లేకుండా పోయేదే.

మ్యూజియంలోకి విగ్రహాలు...
1950 వరకు ఈ మందిరంలో రెండు జైన తీర్థంకరుల విగ్రహాలుండేవి. ఐదడుగుల ఎత్తున్న ఆ విగ్రహాలను దొంగల భయంతో ఒకదాన్ని హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియానికి, మరోదాన్ని మహబూబ్‌నగర్‌ మ్యూజియానికి తరలించారు. ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహాలను అందులోకి తరలిస్తే పర్యాటకులు బారులు తీరడం ఖాయం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జైన భక్తులు వెతుక్కుంటూ వస్తారు.

ఏఎస్‌ఐకి ఇవ్వరెందుకు?
భీతర్‌గావ్‌ తరహాలో దీన్ని కూడా పునరుద్ధరించటం ఏఎస్‌ఐకి కష్టమేమీ కాదు. మందిరం వెనక భాగంలో నగిషీల జాడలు నేటికీ స్పష్టంగా ఉన్నాయి. నిజాం కాలంలో తీసిన కొన్ని చిత్రాలూ అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆలయ నగిషీలను మళ్లీ టెర్రకోటతో రూపొందించొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే ఇది సాధ్యం. ఇందుకు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు మూడుసార్లు ప్రయత్నించారు. ఇంతటి ఇటుకల నిర్మాణాన్ని పునరుద్ధరించే పరిజ్ఞానం తమవద్ద లేదంటూ ఆర్కిటెక్ట్‌ సంస్థలు చేతులెత్తేయడంతో ఏఎస్‌ఐ జోక్యం చేసుకోవాల్సిందేనని 2015లో కేంద్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పురావస్తుశాఖ పరిరక్షణలో ఉన్న ఈ మందిరంతోపాటు కొలనుపాక జైన దేవాలయం, ఓరుగల్లు శంభుని గుడి, బీచ్‌పల్లి కోటలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏఎస్‌ఐ కూడా మిన్నకుండిపోయింది.



1 ఇటుకలతో నిర్మితమైన ఈ మందిరం 1,600 ఏళ్ల నాటిది. టెర్రకోట అలంకారాలతో అత్యద్భుతంగా ఉంటుంది. గుప్త వంశ రాజు కుమారగుప్తుని హయాంలో క్రీస్తుశకం ఐదో శతాబ్దిలో నిర్మితమైంది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌ సమీపంలో భీతర్‌గావ్‌ శివార్లలో ఉన్న ఈ ఆలయం దేశంలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఈ తరహా కట్టడాల్లో అతి పురాతనమైనది. దీని ఎత్తు దాదాపు 58 అడుగులు.

2 భీతర్‌గావ్‌ మందిర ప్రస్తుత రూపమిది. అందమైన నగిషీలు, మధ్యలో చిన్నచిన్న శిల్పాలు, ఎల్తైన గోపురం, చూడచక్కటి ప్రవేశ ద్వారంతో అద్భుతంగా అలరారుతోంది కదూ! పురాతన మందిరాన్ని భావి తరాలకు అందించేందుకు యూపీ సర్కారు పడిన తపనకు నిదర్శనమిది. శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని కాపాడే ఉద్దేశంతో కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు బాధ్యత అప్పగించింది. ఏఎస్‌ఐ దాన్ని దశలవారీగా మరమ్మతు చేసి ఇలా ముస్తాబు చేసింది. ఇప్పుడీ మందిరానికి దేశ, విదేశీ పర్యాటకులు వేలల్లో పోటెత్తుతున్నారు!

మరిన్ని వార్తలు