అంతా పైతరగతికే..

6 May, 2020 11:00 IST|Sakshi

1 నుంచి 9వ తరగతి వరకు పాస్‌

ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

జిల్లాలో 1,32,755 మంది విద్యార్థులు  

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభింస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యనభ్యసించే విద్యార్థులను ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు అందరుపై తరగతులకు అర్హత సాధించినట్లేనని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ అయ్యాయి. దీంతో విద్యార్థులు గృహలకే పరిమితమయ్యారు. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ఈ లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 

పైతరగతులకు ప్రమోట్‌
పదో తరగతి పరీక్షలు మార్చి 19న ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఇంకా ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మిగతా తరగతులకు పరీక్షలు నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాకే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించే పద్ధతి ఉంది. పదో తరగతి పరీక్షల సమయంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు చదివే విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. కానీ ఈ విద్యా సంవత్సరం కరోనాతో ఒంటిపూట బడులతో పాటు పరీక్షలు కూడా నిర్వహించకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. 

ఈ విద్యా సంవత్సరం అంతే..
జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలు, 111 ప్రాథమికోన్నత పాఠశాలలు, 227 ఉన్నత పాఠశాలు, 198 ప్రైవేట్‌ పాఠశాలలతో పాటుగా, 71 కేజీబీవీ, మైనార్టీ, బీసీ, ఇతర సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉ న్నాయి. వీటిలో ప్రైమరీ పాఠశాలల్లో 72824 మంది విద్యార్థులు, 59,931 మంది విద్యార్థులు ప్రాథ మికొన్నత, ఉన్నత, గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు పైతరగతులకు వెళ్లే అవకాశం ఏర్పడింది.

2019 – 20 విద్యా సంవత్సరం ఇంకా మిగిలి ఉండగానే కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌  ప్రకటించడంతో ఒకటి నుంచి తొమ్మిది వరకు చదివే విద్యార్థులను 2020 – 21 విద్యా సంవత్సరంలో పైతరగతులకు ప్రమోట్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా విద్యాధికారి డా.రవికాంతరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు