నీరు-చెట్టు ద్వారా 10 లక్షల మొక్కలు

23 Aug, 2014 03:40 IST|Sakshi

* 111 మున్సిపాలిటీల్లో 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు
* రేపు నెల్లూరులో శ్రీకారం చుట్ట నున్న బాబు, వెంకయ్య

 
 సాక్షి, హైదరాబాద్: నీరు-చెట్టు అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 111 మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకూ 10 లక్షల మొక్కలను నాటుతున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నాటిన మొక్కల్లో 90 శాతం మొక్కలు బతికి చెట్లుగా పెరగాలనే ఆశయంతో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈనెల 24న నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
 
  మున్సిపాలిటీల పరిధిలో చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నివాస యోగ్యత పెరిగి కాలుష్యం తగుతుందని అన్నారు. ఆస్పత్రులు, బస్టాండ్‌లు, పార్కులు, పాఠశాలలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. నాటేందుకు సరిపడా మొక్కల కోసం అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడామని, సరఫరా చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు. బ్యాంకులు, చారిటీ సంస్థలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమానికి సాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు