మోడల్‌ పేపర్‌ నుంచి 10 ప్రశ్నలు

10 Apr, 2018 02:20 IST|Sakshi

యాదృచ్ఛికమా? కావాలనే ఇచ్చారా? 

ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థ 2016లో రూపొందించిన మోడల్‌ పేపర్‌ 

అందులోంచే జేఈఈ ఫిజిక్స్‌లో వచ్చిన ప్రశ్నలు 

ఓ వెబ్‌సైట్‌ కథనంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థ 2016లో రూపొందించిన మోడల్‌ ప్రశ్నపత్రం నుంచి ఆదివారం జరిగిన జేఈఈ మెయిన్‌–2018 ప్రశ్నపత్రంలో ఏకంగా 10 ప్రశ్నలు వచ్చాయి. జేఈఈ మెయిన్‌ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. అయితే ఇదీ యాదృచ్ఛికమా? లేదా కావాలనే ఇచ్చినవా? అన్నది తెలియడం లేదు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నపత్రంలో సదరు కార్పొరేట్‌ విద్యాసంస్థ రూపొందించిన మోడల్‌ పేపర్‌ నుంచి యథాతథంగా ప్రశ్నలు రావడం విద్యార్థుల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ఆ విద్యాసంస్థ 2016 అక్టోబర్‌ 7న ఈ మోడల్‌ పేపర్‌ను రూపొందించి శిక్షణ కోసం విద్యార్థులకు ఇచ్చింది.

ఈ మోడల్‌ పేపర్‌లో ఫిజిక్స్‌ విభాగంలో 30 ప్రశ్నలు ఉండగా.. అందులో నుంచి ఆదివారం జరిగిన జేఈఈ మెయిన్‌ పరీక్షలో 10 ప్రశ్నలు యథాతథంగా రావడం గమనార్హం. ఈ విషయాన్ని ఓ ప్రైవేటు వెబ్‌సైట్‌ (http://cisthetaglobal.com/is&jee&2018&physics&paper&copied&from&model&paper&of&a&famous&coaching/) తమ సైట్‌లో పొందుపరచడంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. వాస్తవానికి జేఈఈ మెయిన్‌ పరీక్షను 90 ప్రశ్నలతో 360 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కేటగిరీలు ఒక్కోటి 30 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. నెగటివ్‌ మార్కుల విధానం ఉంది. ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం గుర్తిస్తే పావు మార్కు కట్‌ చేస్తారు. అంటే పావు మార్కుతోనూ ర్యాంకులు గల్లంతు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఓ కార్పొరేట్‌ విద్యా సంస్థ రూపొందించిన ప్రశ్నపత్రంలోని 40 మార్కులకు సంబంధించిన 10 ప్రశ్నలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఫిజిక్స్‌కే పరిమితమా? 
కార్పొరేట్‌ విద్యా సంస్థ రూపొందించిన ప్రశ్నలు జేఈఈలో ఫిజిక్స్‌ వరకే పరిమితం అయ్యాయా? మ్యాథ్స్, కెమిస్ట్రీలోనూ వచ్చాయా? అన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నల్లో కూడా ఆ విద్యా సంస్థ రూపొందించిన మోడల్‌ పేపర్‌ నుంచి ప్రశ్నలు వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్‌ ఫిజిక్స్‌ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను అడిగిన సరళి రెండింటిలో ఒకేలా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ప్రశ్నపత్రం రూపకల్పన సమయంలో గతంలో ఇచ్చిన ప్రశ్నలనే మళ్లీ ఇవ్వాల్సి వస్తే.. కనీసం ప్రశ్నలడిగే విధానం మారుస్తుంటారని సబ్జెక్టు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కార్పొరేట్‌ విద్యాసంస్థ మోడల్‌ పేపర్‌లోని ప్రశ్నలు, ఆదివారం జరిగిన జేఈఈలో వచ్చిన ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. 

కార్పొరేట్‌ విద్యా సంస్థ ఫిజిక్స్‌ కేటగిరీలో ఇచ్చిన ప్రశ్నల క్రమం.. ఆదివారం నాటి సీ కోడ్‌ ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నల క్రమం.. 

మరిన్ని వార్తలు