100 మంది.. 184 సెట్లు 

20 Nov, 2018 10:40 IST|Sakshi

పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన పలువురు 

ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు 

అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 25 మంది అభ్యర్థులు 

సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగియగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాలకు గాను 100 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరందరు కలిపి 184 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని సోమవారం రాత్రి అధికారులు వెల్లడించారు. 
అత్యధికం.. అత్యల్పం 
జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 25 మంది అభ్యర్థులు 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నారాయణపేటలో అతి తక్కువగా 15 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్లు, మక్తల్‌లో 15 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు అందజేశారు. అదేవిధంగా దేవరకద్రలో  22 మంది అభ్యర్థులు 40 సెట్ల నామినేషన్లు, జడ్చర్లలో 23 మంది అభ్యర్థులు 36 సెట్ల నామినేషన్లు సమర్పించారు. 
అయితే నామినేషన్‌ పత్రాలన్నింటినీ మంగళవారం స్క్రూటినీ నిర్వహించిన అనంతరం వివరాలు సరిగ్గా లేని వాటిని  తిరస్కరించనున్నారు. ఆ తర్వాత అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇక ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. 


పరిస్థితులపై సమీక్ష 
నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ముగియనుండడం తో అన్ని రిజర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండడంతో పోలీసు బందోబస్తుతో పాటు అదనపు సిబ్బందిని నియమించారు.

ఇక మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో అంతకు ముందు వచ్చిన వారినే కార్యాలయాలకు అనుమతించాలని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు