'పాలమూరు'కు అదనంగా రూ.100కోట్లు

28 Sep, 2016 18:42 IST|Sakshi
'పాలమూరు'కు అదనంగా రూ.100కోట్లు

హైదరాబాద్:
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటిపారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లో గతంలో చేసిన డిజైన్ కాకుండా ప్రస్తుత డిజైన్లు, ప్రాధమ్యాలకు తగినట్లుగా మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ రెండు ప్యాకేజీల్లో జరిగే మార్పులతో రూ.100 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను మొదట భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించగా, నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండటం, అటవీ అనుమతుల కోసం జాప్యం జరిగే అవకాశాల నేపథ్యంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని నిర్ణయించింది.

అయితే నిర్మాణ ప్రాంత స్థాల మార్పు, పెరిగే వ్యయ భారం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికను రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. పంప్‌హౌజ్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని, దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య పూర్తిగా తప్పుతుందని అందులో తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో ఉన్న స్టేజ్-2, 3, 4 పంప్‌హౌజ్‌లను పూర్తిగా భూగర్భంలోనే నిర్మిస్తున్నారని, అందుకే స్టేజ్-1ను అలాగే కొనసాగించానే అభిప్రాయం వెలిబుచ్చింది.

భూగర్భ నిర్మాణానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్(ఎన్‌ఐఆర్‌ఎం) సైతం ఆమోదం చెప్పిన విషయాన్ని అందులో పేర్కొంది. గతంలో నిర్ణయించిన నిర్మాణ వ్యయంతో పోలిస్తే, ప్రస్తుత నిర్మాణ వ్యయంలో రూ.50కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని, అయితే భూసేకరణ, అటవీ భూమిని తప్పిస్తున్నందున రూ.50కోట్ల భారం కూడా ఉండదని తేల్చిచెప్పానట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కమిటీ నివేదికకు ఆమోదం దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు