ఆకు సోకు..!

10 Jul, 2019 08:02 IST|Sakshi

నగరంలోని పాన్‌మండీకి వందేళ్ల చరిత్ర

నాడు మొజాంజాహి మార్కెట్‌లో..  

ప్రస్తుతం దారుస్సలాం ప్రాంతంలో..

దేశంలోనే అత్యధికంగా తమలపాకుల వినియోగం  

ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి

దేశంలోనే అత్యధికంగా తమలపాకుల వినియోగం. నిత్యం 25 లక్షల పాన్‌ల తయారీకి ఈ ప్రాంతం నుంచే నగరంలోని పలు షాపులకు సరఫరా. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమలపాకుల ద్వారా సుమారు 25 వేల కుటుంబాలకు జీవనోపాధి.నగరంలో వందేళ్లకుపైగా చరిత్ర. తమలపాకులకూ ఓ ప్రత్యేక మార్కెట్‌. ఇలా ఎన్నో విశేషాలతోకూడుకున్నది నగరంలోని పాన్‌మండీ. దీని గురించి తెలుసుకోవాలనుందా?.. అయితే
ఈ కథనం చదవాల్సిందే మరి.   

నిజాంల హయాం నుంచే..  
నగరంలో నిజాం నవాబుల కాలం నుంచే తమలపాకుల వినియోగం ఉంది. ఆ రోజుల్లో పాన్‌షాప్‌లు నగరంలో అందుబాటులో ఉండేవి కావు. నవాబులు, ఉన్నత వర్గాలు, ధనికుల ఇళ్లలో పాన్‌దాన్‌ ఉండేవి. పాన్‌దాన్‌ అంటే తమలపాకులతో పాటు వక్కలు, సోంపు, సున్నం, కాసుతో పాటు ఇలాచీ, లవంగం ఉండే చిన్నపాటి పెట్టె అన్నమాట. ఏదైనా విందు జరిగిన సందర్భాలతో పాటు ఇంటికి వచ్చిన చుట్టాలకు అన్నపానీయాల అనంతరం నమలడానికి తమలపాకులు తప్పకుండా ఇచ్చేవారు. ఇలా నగరంలో అనాదిగా తమలపాకులు వినియోగం ఉండేది.  

అప్పట్లో మొజాంజాహి మార్కెట్‌లో..
నిజాంల కాలంలోనే పాన్‌ విక్రయాల కోసం పాన్‌మండీని ఏర్పాటు చేశారు. 1919లో మొజాంజాహి మార్కెట్‌లో పాన్‌ విక్రయాలకు అనుమతించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. మొజాంజాహి మార్కెట్‌ 1935లో నిర్మించారు. కానీ అదే ప్రాంతంలో పాన్‌మండీ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. ఆ రోజుల్లో నల్లగొండ, రంగారెడ్డి ప్రాంతాల పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై వివిధ రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడికి వచ్చేవి. ఆ ప్రాంతమంతా మైదానంగా ఉండేది. ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్‌ కూడా సమీపంలోనే ఉండడంతో పాన్‌మండీ ఇక్కడే ఏర్పాటైందని సమాచారం. పాన్‌మండీ 1962 వరకు ఇక్కడే కొనసాగిందని.. అనంతరం దీనిని దారుస్సలాంనకు మార్చినట్లు పాన్‌మండీ నిర్వాహకులు
చెబుతున్నారు.   

ఇవీ ప్రత్యేకతలు..
పాన్‌మండీలో తమలపాకులు పెద్ద పెద్ద బుట్టల్లో దిగుమతి అవుతాయి. కడప జిల్లా నుంచి అత్యధికంగా తమలపాకులు వస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి సైతం కొంత మొత్తంలో మార్కెట్‌కు దిగుమతి అవుతాయి. పాన్‌ షాపుల యజమానులు, కేటరింగ్‌ చేసే వారితో పాటు పాన్‌ విక్రయించే వారు ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో బుట్టలో 2 వేల నుంచి 2,500 తమలపాకులుంటాయి. ఒక్కో బుట్టలో తమలపాకుల నాణ్యతను బట్టి రూ.450 నుంచి రూ.650 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఎండల ప్రభావంతో బుట్ట ఒకటి రూ.800 నుంచి రూ.1150 వరకు పలుకుతోంది.  

వారానికి మూడు రోజులే..  
దారుస్సలాం పాన్‌ మార్కెట్‌లో వారానికి మూడురోజులు మాత్రమే తమలపాకుల వ్యాపారం కొనసాగుతోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నగరంలోని పాన్‌ షాప్‌లకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా తమలపాకులు సరఫరా చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో నగర శివారుతో పాటు నల్లగొండ, మెదక్‌ జిల్లాల నుంచి తమలపాకులు నగర మార్కెట్‌కు దిగుమతయ్యేవి. ప్రస్తుతం కేవలం కడప జిల్లాతో పాటు పాలకొల్లు నుంచి దిగుమతి అవుతున్నాయని వారు
పేర్కొన్నారు.  

వ్యాపారం కొంత తగ్గింది..
గతంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే తమలపాకులు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అన్ని జిల్లాలో పాన్‌మండీలు ఏర్పాటయ్యాయి. నేరుగా తమలపాకులను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం కొంతమేర తగ్గింది.                  – ఖాదర్‌ మొహియొద్దీన్‌

రాష్ట్రంలోనే హోల్‌సేల్‌ మార్కెట్‌..  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హోల్‌సేల్‌ మార్కెట్‌. అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచే తమలపాకులు సరఫరా అవుతాయి. పాన్‌షాప్‌లు, తమలపాకుల ద్వారా నగరంలో 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. నిత్యం నగరంలో 25 లక్షల తమలపాకుల వినియోగమవుతున్నట్లు అంచనా.  

మరిన్ని వార్తలు