ఆరోగ్యం..ఆయుష్షు ఆ పెద్దాయన సొంతం 

11 Jul, 2018 11:39 IST|Sakshi
 గంగరాజు, యుక్త వయసులో ఇలా.. (ఫైల్‌)  

రేపు 101వ పుట్టిన రోజు జరుపుకోనున్న గంగరాజు

వడ్లగూడెంలో కుటుంబ సభ్యుల నడుమ సంబరం

దమ్మపేట : శతమానం భవతి..నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించు అని చెబుతుండే మాట ఈయన విషయంలో మార్చాలి. ఎందుకంటే..అంతకుమించి అనాల్సి ఉంటుంది. దమ్మపేట మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన పాటేటి గంగరాజు (రాజబాబు) వయస్సు అక్షరాల వంద సంవత్సరాలు. రేపు..అంటే 12వ తేదీన ఆయన 101వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు.

12-07-1918న పాలేటి వీరవెంకయ్య, శేషాచలం దంపతుల ఏడుగురు సంతానంలో ఈయన మూడో వాడు. అందరూ మగ సంతానమే కాగా..మిగతావారంతా 60-70 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈయన బాల్యం వడ్లగూడెంలో, హైస్కూల్‌ విద్య ఏలూరులో పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్య అంతా హైదరాబాద్‌లో కొనసాగింది. అప్పటి నిజాం ప్రభుత్వంలో బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలో 40ఏళ్లు విధులు నిర్వహించారు.

అక్కడ ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం వడ్లగూడెంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు సంతానం. భార్య, ఒక కుమారుడు గతంలో మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులంతా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన స్థానికంగా ఉంటున్నారు. కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మునిమనవళ్లు కలుపుకుని..మొత్తం 60మందికిపైగా ఈయన కుటుంబసభ్యులుగా వివిధ ప్రాంతాల్లో ఉండడం విశేషం.

వేడుక చేస్తాం.. 

మా బాబాయిని చూస్తుంటే..ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా భలే ఉన్నారే అనిపిస్తుంది. నేటి తరం వివిధ అనారోగ్యాలతో సతమవుతున్నా ఆనాటి ఆహారం..పనుల వల్ల ఇప్పటికీ ఈయన మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. అందరినీ పలకరిస్తారు. ఊరివారితో ముచ్చటిస్తూ..బాగోగులు తెలుసుకుంటూ..ముని మనవళ్లతో ఆడుకుంటారు. ఇన్నేళ్లు బతికిన పెద్దాయన్ను సత్కరించాలని అనుకున్నాం. ఊరి వాళ్లు, సరిహద్దు ఊరు సీతానగరం వాళ్లు కూడా సంబరం చేద్దామంటున్నారు. అంతా గురువారం రోజు వేడుక చేస్తాం. - పాలేటి చంద్రశేఖర్, సూర్యనారాయణ.

పెసరట్టు ఇష్టం.. 

నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకించి ఆహార నియమాలేమీ పాటించలేదు. కానీ..కాయకష్టం చేసేటోన్ని. అప్పటి రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవు. ప్రతిదీ చెమటోడ్చాల్సి వచ్చేది. అదే..నాకు మంచి ఆయుష్షును ఇచ్చింది. ఇప్పటికీ మాంసాహారం తింటాను. చికెన్, మటన్‌ లాగిస్తాను. పెసరట్టు అంటే చాలా ఇష్టం. మూడు రకాల చట్నీలు కావాలి. పని మనిషి ఆలస్యమైతే..నేనే కొన్నిసార్లు చిన్నపాటి అల్పాహారం చేసుకుంటా.

 

మరిన్ని వార్తలు