పత్తి.. ముంచెత్తి 

9 Aug, 2018 01:49 IST|Sakshi

      పత్తి పంటపైనే రైతన్న భరోసా 

      గులాబీ పురుగు భయపెడుతున్నా ముందుకు..  

      ఇప్పటికే 102% చేరిన సాగు 

      అంచనా 42 లక్షల ఎకరాలు 

      42.66 లక్షల ఎకరాల్లో పంట 

      ఈ సీజన్‌లో 20% లోటు వర్షపాతం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతన్నలు తెల్ల బంగారంపై మోజు పెంచుకున్నారు. గులాబీ రంగు పురుగు భయపెడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నష్టమైనా కష్టమైనా పత్తే మేలు చేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి ఈసారి పత్తి సాగవడాన్ని బట్టే పత్తిపై రైతులు ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 42.66 లక్షల ఎకరాల్లో (102 శాతం) పంట సాగు చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీజన్‌లో దిగుబడి భారీగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మొక్కలు పీకేస్తున్న రైతులు 
గులాబీరంగు పురుగు దాడి గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది 10 లక్షల ఎకరాల్లో పురుగు దాడి చేయగా ఈసారి ఉధృతి ఇంకా ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గులాబీ ఉధృతికి ఇప్పటికే పలుచోట్ల రైతులు మొక్కలు పీకేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోందని, దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది సకాలంలో వర్షాలు కురవక, గులాబీ పురుగు వల్ల పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయని.. గత సీజన్‌లో 3.30 కోట్ల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 2 కోట్ల క్వింటాళ్లకు మించి రాలేదని, కాబట్టి పత్తి రైతులకు మున్ముందు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనుమతిలేని బీజీ–3ని పావు శాతం విస్తీర్ణంలో వేసినట్లు అంచనా. గ్లైఫోసెట్‌ నిషేధంతో బీజీ–3లో పెరిగే కలుపును నివారించే పరిస్థితి కూడా ఉండదు. ఇది కూడా పత్తి రైతుపై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదముంది.  

దిగుబడి పెరిగినా ధర పలకదే! 
భారీ దిగుబడులొచ్చిన ప్రతిసారీ పత్తి ధరలు తగ్గుతుండటం చూస్తూనే ఉన్నాం. పైగా అంతర్జాతీయ పరిస్థితులూ పత్తిపై ప్రభావం చూపుతుంటాయి. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో రైతులను నిలువునా ముంచుతున్న పరిస్థితులూ కనబడుతున్నాయి. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ. 4,020 కాగా, కీలక సమయంలో క్వింటాకు రూ. 3 వేల వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. పైగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా వివిధ కారణాలు చూపి ధర తగ్గించిన పరిస్థితులున్నాయి. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. అయితే పత్తి మద్దతు ధరను కేంద్రం రూ. 5,150కు పెంచడం రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పత్తి చేతికి వస్తున్నందున ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఖరీఫ్‌ పంటల కొనుగోలుపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. 

పుంజుకోని వరి నాట్లు 
ప్రస్తుత ఖరీఫ్‌లో వరి నాట్లు పుంజుకోలేదు. ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.87 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.91 లక్షల (85%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు 92 శాతానికి చేరుకుంది.  

ఈసారి లోటు వర్షపాతం 
రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 423.5 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 338 ఎంఎంలే నమోదైంది. 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే 17 జిల్లాల్లో లోటు, 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి సహా ఇతర పంటలపైనా వ్యతిరేక ప్రభావం ఉంటుందని, వరి నాట్లు వేయడానికి వాతావరణం అనుకూలంగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు