108కు బ్రేకులు..

17 Sep, 2018 11:37 IST|Sakshi

నల్లబెల్లి (వరంగల్‌) : అందరిని ఆదుకునే ఆపద్భందుకు బ్రేకులు పడ్డాయి. అరకొర వేతనాలు.. 12 గంటలకు పైగా పని.. ఉంటే ఉండండి.. పోతే పొండి అనే యాజమాన్యం బెదిరింపులతో 108 ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. 2005 ఆగస్టు 15న ప్రారంభించిన 108 సర్వీసులు ఇప్పటివరకు నిరంతరాయంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

108 అంబులెన్స్‌ల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 37 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 13 ఏళ్ల నుంచి అత్యవసర సమయాల్లో రోగులను రాత్రి పగలనక అంకిత భావంతో ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలకులతో పాటు ఇప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 108 ఉద్యోగులందరికీ భరోసాగా ఉంటామని ప్రకటిస్తూ హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ సాక్షిగా 108 ఉద్యోగులకు తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. దీంతో అప్పట్లో 108 ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అప్పటి నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. చేసేది లేక సమ్మె బాట పట్టారు.
 
గతంలో మూడు సార్లు..
108 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం 2011, 2013, 2015 సంవత్సరాల్లో సమ్మెకు దిగారు. ప్రభుత్వమే 108 నిర్వహణ కొనసాగించాలని, జీఓ నం బర్‌.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని, రోజుకు 8 గంటల పని సమయం నిర్ణయించాలని, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని, పబ్లిక్‌ ప్రైవేటు పాట్నర్‌షిఫ్‌ (పీపీపీ) విధానాన్ని రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో ప్రభుత్వం 108 ఉద్యోగుల డిమాండ్‌ నెరవేరుస్తామని హామినిచ్చింది. కానీ ఇంత వరకూ నెరవేర్చలేదు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి మళ్లీ ఆగస్టు 11 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ఇటీవల లెబర్‌ కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులు, జీవీకే సంస్థ నిర్వాహకులకు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది సమ్మెలో పాల్గొంటున్నారు.

పూట గడవని బతుకులు..
108 ఉద్యోగులు అంకిత భావంతో చేస్తున్న పనిగొప్పది. అత్యవసర సమయాల్లో ఎంతో మందిని సరైన సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడుతూ కుటుంబాలకు అండగా ఉండేది. రాత్రనక.. పగలనక 12 గంటలు విధులు నిర్వహిస్తే సంస్థ నిర్వాహకులు రూ.13 వేల నుంచి 14 వేల వరకు ఇస్తున్నారు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు ఉండవు. అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే వేధింపులకు గురిచేస్తూ పని చేస్తే చేయండి లేదంటే మానేసుకొమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారంటే వారి బాధలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అయినా.. నేడో రేపో ప్రభుత్వం తమను గుర్తిస్తుందనే ఆశతో ఇన్నాళ్లు పనిచేస్తూ వస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికుడు రోజులో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ 108 ఉద్యోగులు మాత్రం రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. అదనంగా పనిచేసిన 4 గంటలకు ఎటువంటి ఓవర్‌ టైం పేమెంట్‌ ఇవ్వడంలేదు. అంతే కాకుండా 12 గంటలు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో ఏదైనా కేసు వస్తే మరో రెండు గంటలు అదనంగా పని చేయాల్సి వచ్చేది. ఇలా నిత్యం 12 నుంచి 14 గంటల పని భారం తప్పేది కాదు. సిబ్బంది సరిపడా లేకపోవడంతో సమయానికి సెలవులు కూడా ఇవ్వడం లేదని పలువురు 108 ఉద్యోగులు వాపోతున్నారు.

అత్యవసర సేవలపై ప్రభావం..
108 ఉద్యోగులు ప్రజలను అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్పత్రులకు తరలిస్తున్న సమయాల్లో సంబంధిత వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సమ్మె కారణంగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అత్యవసర సేవలు అందడం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో అంబులెన్సులు 40 ఉన్నాయి. పైలెట్లు, ఈఎంటీలు 220 మంది మొత్తం ఉద్యోగులు ఉన్నారు. 172 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. 

పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108ను పబ్లిక్‌ ప్రైవేట్‌ పాట్నర్‌షిఫ్‌ (పీపీపీ) పద్ధతిలో 2009 సంవత్సరంలో జీవీకే సంస్థకు కట్టబెట్టారు. ఈ విధానం 108 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తూ 108 నిర్వహణ ప్రభుత్వమే కొనసాగించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరిస్తుంది. – అశోక్‌ పల్లె, తెలంగాణ 108 ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు. 

మరిన్ని వార్తలు