పిలిస్తే పలికే దైవం 108

6 May, 2018 10:50 IST|Sakshi
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న 108వాహన సిబ్బంది(ఫైల్‌)

గతేడాది డిసెంబర్‌ 1వ తేదీన రుద్రారం పంచాయతీ బోయపల్లితండాకు చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతోంది.   విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడుకు చేరుకుని వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో వాహనంలోనే ఆమెకు పురుడు పోశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బాబుకు ఊపిరి ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. క్షణాల్లో స్పందించిన సిబ్బంది చిన్నారికి చికిత్సలు చేసి ఆక్సిజన్‌ అందించారు. దీంతో బాబు కెవ్వుమని ఏడ్చాడు.. అందరి కళ్లూ ఆనందంతో చెమర్చాయి.   

కొడంగల్‌ రూరల్‌ : ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో క్షతగాత్రుల వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించి, సకాలంలో హాస్పిటల్‌కు తరలిస్తున్న 108 వాహనాలు ప్రజల గుండెల్లో.. పిలిస్తే పలికే దైవంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆపదలో వారికి మేమున్నామంటూ తరలివస్తున్న 108 సిబ్బంది ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. ఇందులో పని చేస్తున్న సిబ్బంది అంకితభావంతోనే ఇది సాధ్యమవుతోంది. అత్యవసర చికిత్స విభాగంలో పనిచేయడం తమకు భగవంతుడు అందించిన వరంగా భావిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా.. మెరుపు వేగంతో స్పందిస్తున్న వీరి సేవలు అనిర్వచనీయం.

 
గతంలో అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. దీనికి తోడు వాహనాలు కూడా అతి తక్కువే. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే వాహనాలు ఉన్నవారిని బతిమాలి, ఒక్కో దశలో వారు అడిగినన్ని డబ్బులు ఇచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకంతో పేద ప్రజలకు ఈ బాధలు తప్పాయి. ఒక్క ఫోన్‌ కాల్‌తో వచ్చి వాలుతున్న 108 సిబ్బంది వాయువేగంతో అత్యవసర సేవలు అందిస్తున్నారు. సంఘటన స్థలంలో ప్రథమ చికిత్స చేసి బాధితులు, క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. కొడంగల్‌ అంబులెన్స్‌లో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఎమర్జెన్సీ టెక్నీషియన్లు(ఈఎంటీ)లు విధులు నిర్వర్తిస్తున్నారు.

2017 జనవరి నుంచి 2018 ఏప్రిల్‌  వరకు 1,414 మంది బాధితులకు రక్షణ కవచంలా నిలిచారు. వీరిలో 606 గర్భిణులు, 158 మంది రోడ్డు ప్రమాద బాధితులు, 102 మంది ఆత్మహత్యా యత్నం చేసిన వారు,  32 పాము కాటుకు గురైనవారు, వివిధ ప్రమాదాలకు గురైన 516 మందిని ఆస్పత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాలు, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వారు. అనారోగ్యానికి గురైన వృద్ధులు, గాయాలకు గురైన వారు గుండె నొప్పితో బాధపడే వారెందరికో పునర్జన్మను పొందారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సౌకర్యం, డెలివరి కిట్‌తో పాటు పురుగుల మందు తాగిన వారిని కాపాడేందుకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి సపోర్టుగా పెట్టేందుకు అధునాతన సామగ్రి ఉంటుంది. ప్రసవ వేదనతో బాధపడే ఎంతో మందికి వాహనంలోనే పురుడు పోసిన సందర్భాలున్నాయి.

మరిన్ని వార్తలు