నేటి అర్ధరాత్రి నుంచి 108 సేవలు బంద్

7 May, 2015 00:54 IST|Sakshi

నల్లగొండ టౌన్ ఆపదలో ఉన్న వారికి నేనున్నానని కుయ్..కుయ్ అంటూ ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించే 108 వాహనాలు గురువారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్తుండడంతో ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్ పడనుంది.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..
గత సమ్మెకాలంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలని, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, 8గంటల పనివిధానాన్ని అమలు చేయాలని, 108 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి ఉద్యోగులు గతంలోనే సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ విషయమై 108 సర్వీసుల యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

దీంతో జిల్లాలో పనిచేస్తున్న 36 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. 108 వాహనాలలో సుమారు 152 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులందరూ సమ్మెలోకి వెల్తున్నందున ఎమర్జెన్సీ వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. ప్రమాదాల బారిన పడిన వారు, వివిధ అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వచ్చే వారికి తీవ్ర అసౌకర్యం కలగకతప్పదు. ఒక వేళ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లినట్లయితే అయితే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాలు తిరగడానికి అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు 108 సేవల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బి.నాగేందర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు