109 కాలేజీలకు అనుమతులివ్వం

14 Jun, 2018 03:10 IST|Sakshi
ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌

యాజమాన్యాలే ఆ కాలేజీల్లో చేరిన పిల్లలకు ప్రత్యామ్నాయం చూపాలి

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు.

వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఇంటర్‌ కాలేజీకీ హాస్టల్‌ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. జూనియర్‌ కాలేజీల అనుమతులపై మంగళవారం సాక్షిలో ‘ఇంటర్‌ బోర్డు అధికారుల గుర్తింపు దందా’శీర్షికతో వచ్చిన వార్తపై బోర్డు కార్యదర్శి స్పందించారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్‌ 20 వరకు పెంచినట్లు చెప్పారు.  

వెబ్‌సైట్‌లో కాలేజీల వివరాలు..
గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. ఈ నెల 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్‌ 21 నాటికి వెబ్‌సైట్‌లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. 

మరిన్ని వార్తలు