‘టెన్త్’ పరీక్ష ఫీజు మినహాయింపు!

14 Sep, 2014 02:05 IST|Sakshi

ప్రభుత్వ పరిశీలనలో ఫైలు
ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే యోచన
 
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మినహాయింపులో అశాస్త్రీయంగా ఉన్న మినహాయింపు నిబంధనలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫీజు మినహాయింపునకు పరిగణనలోకి తీసుకునే ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ప్రతిపాదనలపై పరిశీలన జరుపుతోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించే సయమానికల్లా దీనిని ఖరారు చేసే అవకాశం ఉంది.
 
 ప్రస్తుతం గ్రామా ల్లో ఏటా రూ. 20 వేలలోపు ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి పిల్లలకు, పట్టణాల్లో అయితే ఏటా రూ. 24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారి పిల్లలకు మాత్రమే ఫీజు మినహాయింపు వర్తిస్తోంది. అలాగే గ్రామాల్లో 2.5 ఎకరాలలోపు వెట్ ల్యాండ్ ఉన్న, 5 ఎకరాలలోపు డ్రై ల్యాండ్ ఉన్న వారి పిల్లలకు మినహాయింపు వరిస్తోంది. భూమి నిబంధనను పక్కనబెడితే.. ప్రస్తుతం గ్రామాల్లో కూలీకి రోజుకు రూ. 100 వరకు వస్తోంది. ఈ లెక్కన ఏటా వారి ఆదాయం రూ. 20 వేలు దాటుతోంది. ప్రస్తుత పరిస్థితులు, శాస్త్రీయత లేని ఆ నిబంధనల వల్ల విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ నిబంధనలను మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు