35% కాదు.. 37% దాటాల్సిందే

11 Nov, 2014 02:31 IST|Sakshi

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలు
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల 10వ వేతన సవరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు  తెలిసింది. ఇందులో భాగంగానే  బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు అధికారవర్గాలు వివరించాయి.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భత్యం చెల్లిస్తున్నారు. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది 29 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే. మరో ఆరేడు శాతం పెంచి ఫిట్‌మెంట్‌ను 35 శాతంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు.
 
  ప్రస్తుతం 61 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా.. కనీసం 37 శాతం దాటితే తప్ప ఫలితం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. 37 శాతం దాటితే రెండు, 42 శాతం దాటితే మూడు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫిట్‌మెంట్‌లో ఒక శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా మూడు వందల కోట్ల మేరకు భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అనంతరం కసరత్తు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. అయితే  కేంద్ర వేతన సవరణ తరువాతనే కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలను  ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

>
మరిన్ని వార్తలు