11 హాట్‌స్పాట్లు!

7 Apr, 2020 12:30 IST|Sakshi
హాట్‌స్పాట్‌గా ప్రకటించిన ఖిల్లా రోడ్డులో ప్రధాన రహదారి మూసివేత

ప్రకటించిన కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి

కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఇంటి నుంచి కిలోమీటర్‌ వరకు పరిధి

ఈ ప్రాంతానికి పూర్తిగా రాకపోకల కట్టడి తాజాగా మరో పది పాజిటివ్‌ కేసులు  

జిల్లాలో 29కి చేరిన వ్యాధిగ్రస్తుల సంఖ్య

అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలోని పలు ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లు (హాట్‌ స్పాట్‌)లుగా ప్రకటించింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులున్న ఇంటి నుంచి అర కిలోమీటర్‌ నుంచి కిలో మీటర్‌ వరకు ఈ కస్టర్‌ పరిధి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్లస్టర్ల పరిధిలో నివసిస్తున్న వారందరిని 14 రోజుల పాటు ఆ ప్రాంతం నుంచి బయటకు రానివ్వరు. బయట వ్యక్తులను ఈ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతించరు. ఈ ప్రాంతాలన్నింటిని కట్టడి చేసి నోమూవ్‌మెంట్‌ జోన్‌లుగా మార్చుతారు. సోమవారం కలెక్టర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కొత్తగా..
జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా సోమవారం మరో పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 19 పాజిటివ్‌ కే సులు ఉండగా, తాజాగా నమోదైన పది కేసులతో క లిపి జిల్లాలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 29కి చే రింది. కొత్తగా పాజిటివ్‌ వచ్చిన పది మందిలో ఏడుగురు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు కాగా, ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులకు వ్యాధి సోకినట్లు తేలింది. మరో 130 మంది శాంపిల్స్‌కు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టు రావాల్సి ఉంది.

అందుబాటులో వైద్యాధికారులు..
ఈ కస్లర్లలో ఇళ్లనుంచి ప్రజలు బయటకు రాకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీరికి కావాల్సిన నిత్యావసరాలు, మందులు, ఇలా అన్ని సౌకర్యాలను అధికారులే ఇంటింటికి వెళ్లి సరఫరా చేయాలని నిర్ణయించారు. మందులు, కూర గాయలు, ఇతర సరుకులు డోర్‌ డెలివరీ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లస్టర్‌ పరిధిలో ప్రతి 100 మందికి ఒక ఆశవర్కర్, పది మంది ఆశా వర్కర్లకు ఒక ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్, ఓ వైద్యాధికారిని నియమించాలని నిర్ణయించారు. క్లస్టర్‌ పరిధిలో ఓ కాల్‌సెంటర్‌ కార్యాలయం, అంబులెన్స్‌ అందుబాటులో ఉంటుంది.

వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లకండి..  
హాట్‌స్పాట్‌లన్నింటినీ బ్లాక్‌ చేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్‌ల కొనసాగింపునకు స్థానిక ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు యువకులు అనవసరంగా రోడ్లమీదికి వస్తున్నారని, వారు బయట తిరగడం ద్వారా వైరస్‌ను ఇంటికి తీసుకెళుతున్న విషయాన్ని గుర్తెరుగాలని హెచ్చరించారు.
మీ కుటుంబసభ్యులను కాపాడుకునే బాధ్యత మీపైనే ఉందని అన్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతూ వైరస్‌ మరింత వ్యాప్తికి కారణం కావద్దని పిలుపునిచ్చారు. క్లస్టర్లను నో మూవ్‌మెంట్‌ జోన్లుగా కొనసాగేలా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నా రు. విదేశాల నుంచి వచ్చిన వారి హోం క్వారంటైన్‌ కొనసాగిస్తామని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పర్సనల్‌ప్రొటక్షన్‌ కిట్లకు ఏమాత్రం కొరత లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు వైద్యాధికారులందరికి ఈ కిట్లను సరఫరా చేస్తున్నామన్నారు.

బాన్సువాడలో మూడు జోన్లు..
బాన్సువాడ :  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో పట్టణంలోని టీచర్స్‌ కాలనీ, మదీనా కాలనీ, అరాఫత్‌ కాలనీలను హాట్‌స్పాట్‌ జోన్లుగా గుర్తించారు. ఈ జోన్లను ఆనుకుని ఉన్న మరో ఐదు కాలనీల్లోని 1788 ఇళ్లను  దిగ్బంధిస్తున్నట్లు ఆర్డీఓ రాజేశ్వర్‌ తెలిపారు. ఆయా కాలనీల నుంచి ఒక్కరు కూడా బయటకు రావద్దని, కూరగాయలు, పాలు ఇంటి వద్దకే సరఫరా చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు ఈ కంటోన్మెంట్‌ జోన్లను దిగ్బంధిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ శ్వేతతో కలిసి ఆర్డీఓ కరోనా పాటిజివ్‌ వచ్చిన బాధితుల కాలనీల్లో పర్యటించారు.

ప్రజల్లో మార్పు రావాలి : కార్తికేయ, సీపీ
వైరస్‌ వచ్చి ప్రాణాలు పోతుంటే.. ఇవేవీ పట్టించుకోకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తున్న ప్రజల్లో మార్పు రావాలని సీపీ కార్తికేయ అన్నారు. పోలీసులు లాఠీ చూపి చెప్పే వరకు చూడకుండా ప్రజల్లోనే క్రమశిక్షణ పెరగాలన్నారు. జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం అందరూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. రేషన్‌ షాపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.  

 జిల్లాలో ప్రకటించిన హాట్‌స్పాట్‌లు ఇవే..
1. హైమద్‌పుర  
2. మాలపల్లి
3. అబీబ్‌నగర్‌
4. ఆటోనగర్‌
5. ఖిల్లారోడ్‌
6. మాక్లూర్‌
7. నందిపేట్‌
8. బోధన్‌
9. రెంజల్‌ (కందకుర్తి)
10. భీమ్‌గల్‌
11.  బాల్కొండ – సొమవారం అర్ధరాత్రి నుంచే వీటిని హాట్‌ స్పాట్లు ( కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్‌)గా   పరిగణన

మరిన్ని వార్తలు