ఆ దుర్ఘటన జరిగి 11 ఏళ్లయింది

31 Jul, 2019 11:03 IST|Sakshi

సాక్షి, కేసముద్రం : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్ని ప్రమాద ఘటన జరిగి నేటికి పదకొండేళ్లు. ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 2008 జూలై 31న అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు డౌన్‌లైన్‌లో వెళ్తున్న గౌతమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా కొద్ది నిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో నాలుగుబోగీలు పూర్తిగా కాలిపోగా.. ముప్ఫై మంది ఆ మంటలకు బలయ్యారు. ఈ ఘటన జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నా స్థానికుల మదిలో నుంచి ఆనాటి బాధితుల ఆర్తనాదాలు, మంటలు చెరిగిపోవడం లేదు.

ఉలిక్కిపడిన కేసముద్రం
రైలులోని ప్రయాణికులందరూ నిద్రలో జోగుతున్నారు.. ఇంకా కొన్ని గంటల్లో తమ గమ్యస్థానాలకు చేరుతామనే ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. కానీ వారికి అదే చివరి రాత్రి అయింది. ఇదీ గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 11 ఏళ్ల క్రితం ప్రయాణించిన వారికి ఎదురైన పరిస్థితి. సికింద్రాబాద్‌ నుంచి  కాకినాడకు బయలుదేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ కేసముద్రం – తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్యకు చేరుకుంది. ఇంకా కొద్దిసేపు అయితే  మహబూబాబాద్‌ స్టేషన్‌లో ఆగాల్సి ఉంటుంది.

దీంతో జనరల్‌ బోగీల్లోని పలువురు దిగేందుకు సిద్ధమవుతుండగా బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తూ ఏం జరిగిందో తెలుసుకునే లోగా ఎస్‌9, 10, 11, 12 బోగీలు పూర్తిగా అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గుర్తుపట్టలేనంతగా...
గౌతమి ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు బోగీలు కాలిపోయిన ఘటనలు ఇద్దరు మహిళలు ఊపిరాడక మృతి చెందారు. మరో 30 మంది అగ్నికీలల్లో మాడి మసయ్యారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి కొందరి మృతదేహలను గుర్తించినా... మరో 20 మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తూ గల్లంతైన వారికోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు రెండేళ్ల పాటు నిరీక్షించారు.

చివరకు బాధితులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు గుర్తించని గల్లంతైన వారు గౌతమి ఘటనలో మృతి చెందినట్లుగా ఏప్రిల్‌ 2010 అంటే ఘటన జరిగిన తొమ్మిది నెలలకు కేసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మరణ ధృ«వీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ మేరకు వారి కుటుంబాలకు రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందింది. కాగా, ఈ ఘటన జరిగిన రోజు కేసముద్రం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటన జరిగిన తెల్లవారుజామున రైల్వే ఉన్నతాధికారులతో పాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి నారాయణ్‌బావ్‌ రత్వా, రైల్వే సేఫ్టీ కమిషన్‌ అధికారులు, రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు కేసముద్రానికి తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గౌతమి బోగీల్లోకి ఎక్కి పరిశీలించడంతో పాటు బాధితులను ఓదార్చారు.

పది రోజులకు పైగా మృతి చెందిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడే తిరగడం.. కలిసిన అధికారులకు తమ గోడు వెళ్లబోసుకోవడం వంటి హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక కాలిబూడిదైన బోగీలను చూసేందుకు వచ్చిన చుట్టుపక్కల వారంతా అస్తిపంజరాలు, కళేబరాలను చూసి తట్టుకోలేక పోయారు.

గౌతమి ఘటన జరిగిన పది రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలు దిగ్బ్రాంతి నుంచి కోలుకోలేకపోయారు. రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండురోజుల పాటు కాజీపేట – విజయవాడ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

మరిన్ని వార్తలు