భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్.. నెల రోజుల్లో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో ఖాళీగా ఉన్న 1100 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార బ్యాంకుల్లో పరిస్థితిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. సమావేశంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సహా పలువురు నాబా ర్డు, సహకార బ్యాంకుల అధికారులు పాల్గొ న్నారు.
ఈ సమావేశం వివరాలను పార్థసారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. టెస్కాబ్, డీసీసీబీల్లో 600 క్లరికల్, ఆఫీసర్ స్థాయి పోస్టులను.. 500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డ్రైవర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారని, త్వరలో వాటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ డీసీసీబీలు బలహీనంగా ఉన్నాయని తేల్చినట్లు చెప్పారు. వాటిల్లో ఐదు శాతంపైగా నిరర్ధక ఆస్తులున్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నామని అన్నారు. అలాగే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ డీసీసీబీలకు పూర్తిస్థాయి సీఈవోలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.