ఆ ఊరు నుంచి 12 మంది డాక్టర్లు

16 Oct, 2019 09:08 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : ఆ గ్రామంలో పసుపుతో పాటు వరి, మొక్కజొన్న వంటి మిశ్రమ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతుంటారు. అంతేకాదు అక్కడి రైతులు రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్‌ చేసుకుంటూ ఆదర్శ రైతులుగా మారి, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాంటి గ్రామంలో ఓ వైపు లక్ష్మీ కళ తాండవిస్తుంటే, మరో వైపు సరస్వతీ కళ కూడా తాండవిస్తోంది. ఆ గ్రామమే జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్‌.

జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క లక్ష్మీపూర్‌ గ్రామం నుంచే దాదాపు 12 మంది డాక్టర్లు ఉండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే నలుగురైదుగురు డాక్టర్లు తమ వైద్య వృత్తిని కొనసాగిస్తుండగా, మరికొందరు త్వరలోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం వైద్యులుగా కొనసాగుతున్న డాక్టర్‌ జయంతి–డాక్టర్‌ ఉదయ్‌ జగిత్యాలలో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయగా, మేడిపల్లి ప్రియాంక– శ్రీనివాస్‌రెడ్డిలు హైదరాబాద్‌లో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అలాగే డాక్టర్‌ కొప్పెర మహేశ్‌– శిరీష జగిత్యాలలో ఆర్థోపెడిక్‌ అసుపత్రిని ఏర్పాటు చేయగా, అటుకుల రాహుల్‌ ఎంబీబీఎస్‌ పూర్తి కాగా, పీజి కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు.

ఇక గర్వందుల శరణ్య ఎంబీబీఎస్‌లో భాగంగా హౌస్‌ సర్జన్‌ చేస్తుండగా, ఎర్రవేల్లి శ్రీనాథ్, పన్నాల మధు, గడ్డం గోవర్ధన్‌రెడ్డిలు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఇంకా నాతర్ల సంజీవ్‌ బీడీఎస్‌ పూర్తి చేసి ఎండీఎస్‌ చదువుతుండగా, గర్వందుల నందిని బీడీఎస్‌ చదువుతుంది. వీరిని చూసిన మరికొందరు కూడా ఆ గ్రామం నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. అందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించినవారే కావడం మరీ విశేషం.

అందరూ రైతుబిడ్డలే.. పిల్లలకే పూర్తి స్వేచ్ఛ.. 
రాత్రనక, పగలనక కష్టపడి పంట సాగు చేసిన వారి బిడ్డలే డాక్టర్లు అయినవారిలో ఉన్నారు. ఆ రైతులకు ఏ పంట ఎప్పుడు వేయాలో తెలుసు. పండించిన పంటలో ఎలా ఆదాయం పొందాలో తెలుసు. కాని వారి పిల్లలు మాత్రం ఏం చదువుతున్నదో వారికి తెలియదు. అయితే పిల్లలకు తల్లితండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీ ఇష్టం వచ్చింది చదవండి. ఎంతైనా పెట్టుబడి పెడతాం. కాని పట్టుదలతో చదవి ఏదైనా సాధించండి అని మాత్రం చెప్పారు. డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలి అని ఏ తల్లితండ్రి చెప్పలేదు. పిల్లలే తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం పరితపించి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు ఆ బిడ్డలు వారి తల్లితండ్రులకే కాకుండా ఆ గ్రామానికి పేరు తీసుకువచ్చారు. ఇటీవల డాక్టర్లు అయినవారిని, డాక్టర్లు కాబోతున్న వారిని లక్ష్మీపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మానించగా, వారి తల్లితండ్రులు భావోద్వేగంతో ఆనందభాష్పాలను రాల్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా