ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు 12నెలల వేతనం

6 Sep, 2018 01:11 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నాయిని, కడియం శ్రీహరి. చిత్రంలో మహమూద్‌ అలీ తదితరులు

ఉపాధ్యాయ దినోత్సవంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఈనెలాఖరు నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ పథకానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇకపై ఏటా 12 నెలల వేతనాన్ని ఇస్తామన్నారు. ఇప్పటివరకు పది నెలల వేతనమే ఇచ్చేదని, ఇకపై వారంతా 12 నెలల జీతం అందుకోనున్నట్లు వివరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ లతో కలసి కడియం శ్రీహరి పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ కాలేజీల్లో 3,728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఆమోదానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.  ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని వచ్చే ఏడాది నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కృషి చేస్తామని శ్రీహరి ప్రకటించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన∙వారిని మంత్రులు సన్మానించారు. అనంతరం స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ రూపొందించిన అనుభవాత్మిక అభ్యసనం– గాంధీజీ నయితాలీమ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కాటెపల్లి జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఉత్తర్వులు జారీ
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇకపై ఏడాదిలో 12 నెలలు జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏడాది లో 10 నెలల కాలానికే జీతం చెల్లిస్తుండగా, ఇకపై 12 నెలలూ జీతం చెల్లించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు