ఉల్లం‘ఘనం’

15 Jun, 2014 00:22 IST|Sakshi
ఉల్లం‘ఘనం’
  •     వారంలో 120 ఫిట్‌లెస్ స్కూల్ బస్సుల స్వాధీనం
  •      లెసైన్స్‌లు లేని డ్రైవర్ల చేతికి వాహనాలు
  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు లేకుండానే వందల కొద్దీ బస్సులు రోడ్డెక్కేస్తున్నాయి. వారం రోజులుగా ఆర్టీఏ జరిపిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వాటిలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 120 బస్సులను స్వాధీనం చేసుకున్నారు.

    ప్రతి సంవత్సరం స్పెషల్ డ్రైవ్ పేరుతో స్కూల్ బస్సులకు తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు అందజేసే ఆర్టీఏ అధికారులు ఈ  ఏడాది ఆ కర్తవ్యాన్ని విస్మరించారు.స్వచ్ఛందంగా వచ్చిన బస్సులకు మాత్రమే తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి.

    ఫిట్‌నెస్ లేని బస్సులను సైతం పిల్లలను చేరేవేసేందుకు రోడ్డు మీదకు ఎక్కించాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఆర్టీఏ రంగంలోకి దిగింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్‌లు ఇందుకోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    ఈ వారంలో నిర్వహించిన దాడుల్లో మొత్తం  150 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విండో గ్లాసెస్ లేకపోవడం, రంగు వెలసి పోవడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడిన బస్సులపై కొద్ది మొత్తంలో జరిమానా విధించి వదిలివేయగా, తీవ్రమైన తప్పిదాలతో దొరికిన 120 బస్సులను మాత్రం  స్వాధీనం చేసుకున్నారు.
     
    నిబంధనలకు నీళ్లు
     
    బడి పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పాఠశాలలు తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్నాయి. ఏడాది పాటు  ప్రేక్షకపాత్రకే పరిమితమై జూన్ ప్రారంభంతో ఆగమేఘాల మీద తనిఖీలకు దిగిన ఆర్టీఏ అధికారుల తీరు కూడా ఈ నిర్లక్ష్యానికి ఆజ్యంపోస్తోంది. ఫలితంగా మోటారు వాహన చట్టాలకు ఈ బస్సులు పాతరేస్తున్నాయి.
     
    పట్టుబడిన వాటిలో ఉల్లంఘనలివీ..
    ఫిట్‌లెస్ వాహనాల్లోనే పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నారు.
         
    సీట్ల సామర్ధ్యానికి మించి ఒక్కో బస్సులో 10 నుంచి 20 మంది పిల్లలకు ఎక్కువగా ఎక్కిస్తున్నారు. ఈ పిల్లలంతా  సీట్లలో కూర్చొనేందుకు అవకాశం లేక నించొని పయనించవలసి రావడం దారుణం.
         
    మరో దిగ్భ్రాంతికరమైన అంశం పలువురు డ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా దొరికిపోవడం. సాధారణంగా అనుభవజ్ఞులైన  డ్రైవర్లు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వాళ్లు మాత్రమే పిల్లల బస్సులు నడపాలని చట్టం చెబుతుంది. అందుకు విరుద్దంగా  తేలికపాటి వాహనాలను నడిపేందుకు మాత్రమే అనుమతి ఉన్న డ్రైవర్లు, కొత్తగా నేర్చుకున్నవాళ్లు ఈ బస్సులు నడపడం గమనార్హం.
         
    మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో పిల్లలను ఎక్కించేందుకు దించేందుకు అటెండర్ ఉండాలి. కానీ చాలా బస్సులు అలాంటి అటెండర్‌లు లేకుండానే నడుస్తున్నాయి.
         
    అనేక బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు లేవు
     

మరిన్ని వార్తలు