ఆకాశ వీధిలో..

8 Jul, 2020 08:44 IST|Sakshi

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 126 ఫ్లైట్‌లు

రోజుకు 12,500 మంది ప్రయాణికులు  

దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ

ఆగస్ట్‌ నుంచి అంతర్జాతీయ విమానాలకు చాన్స్‌

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ  సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మొదట్లో విమాన యానంపై ప్రయాణికులు వెనకంజ వేశారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఎయిర్‌పోర్టులో అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులు అంతంత మాత్రంగానే నడిచాయి. రెండు నెలల లాక్‌డౌన్‌అనంతరం మే 25న ప్రారంభమైన విమాన సర్వీసులు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ప్రతి రోజు 126విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రద్దీతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య తక్కువే. అత్యవసరమైతేనే రాకపోకలు సాగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు తెలిపాయి.

మొదట్లో కొన్ని నగరాలకు  సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం ముంబై, చెన్నైలతో పాటు సుమారు 40కిపైగా నగరాలకు దేశీయ విమానాలు క్రమం తప్పకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, విజయవాడ, వైజాగ్, కడప, «త్రివేండ్రం, కొచ్చి, బెంగళూరు, భోపాల్, లక్నో తదితర నగరాలకు ప్రయాణికులు వెళ్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు 63 విమానాలు నగరానికి చేరుకుంటుండగా మరో 63 హైదరాబాద్‌ నుంచి వివిధ నగరాలకు బయలుదేరి వెళ్తున్నాయి. ప్రతి రోజు 6,300 మంది హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మరో 6,200 మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు.

రాకపోకలు ఇలా..  
సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత మే 25న దేశీయ విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, మరో 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3వేల మంది ప్రయాణం చేశారు. మొదటి రోజు  హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని విద్యానగర్‌కు బయలుదేరిన మొదటి ట్రూజెట్‌ విమానంలో కేవలం 12 మంది బయలుదేరడం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్‌ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. రెండోరోజు 2500 మంది రాకపోకలు సాగించారు. ఆపరేషన్‌లు ప్రారంభమైన 3వ రోజు 3,500 మంది ప్రయాణం చేశారు. మూడో రోజు 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ ఇండియా, ట్రూజెట్‌ తదితర ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ  ఆదేశాలకనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. ప్రస్తుతం 126 సర్వీసులు రాకపోకలు సాగించడం గమనార్హం. సాధారణ రోజుల్లో 460 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతాయి. రోజుకు 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. కోవిడ్‌ దృష్ట్యా రాకపోకలు తగ్గిన సంగతి తెలిసిందే.  

ఈ నెల ముగిసిన పిదపే..  
మరోవైపు అంతర్జాతీయ విమానాలకు ఇప్పట్లో అనుమతి లభించకపోవచ్చని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అంతా అనుకూలంగా ఉంటే  ఆగస్ట్‌లోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావచ్చని జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు వందేభారత్‌ మిషన్‌లో  భాగంగా ప్రత్యేక విమానాలను నడిపారు. త్వరలో మరిన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికులే స్వయంగా ఏర్పాటు చేసుకొనే చార్టెడ్‌ విమానాలు కూడా పలు దేశాల నుంచి రాకపోకలు సాగించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ వైరస్‌ వ్యాపించకుండా ఎయిర్‌పోర్టులో పటిష్టమైన రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. బ్యాగేజ్‌ కోసం శానిటైజ్‌ టన్నెల్స్‌ పని చేస్తున్నాయి. సెల్ఫ్‌ చెక్‌ ఇన్, భౌతికంగా తాకేందుకు అవసరం లేని పద్ధతిలో తనిఖీలను కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు