128 నామినేషన్లు

9 Jan, 2020 08:20 IST|Sakshi

తొలిరోజు మేడ్చల్‌ జిల్లాలో 48..

రంగారెడ్డిలో 80 నామినేషన్లు దాఖలు

మున్సిపల్‌ ఎన్నికల హడావుడి షురూ

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: హైదరాబాద్‌ నగర శివార్లలోని  మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు నగర పాలక సంస్థలు, 21 మున్సిపాలిటీలకు సంబంధించి మొదటి రోజైన బుధవారం 128 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నగర పాలక సంస్థల్లో 49 నామినేషన్లు రాగా, మున్సిపాలిటీల్లో 79 నామినేషన్లు దాఖలయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలోని పీర్జాదిగూడలో అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలు కాగా, బోడుప్పల్‌లో రెండు, జవహర్‌నగర్‌లో ఒకటి, నాగారంలో రెండు, పోచారంలో మూడు, ఘట్‌కేసర్‌లో నాలుగు, తూముకుంటలో 8, కొంపల్లిలో ఐదు, గుండ్లపోచంపల్లిలో మూడు, మేడ్చల్‌లో నాలుగు, దుండిగల్‌ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో  పార్టీల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి 18 నామినేషన్లు, బీజేపీ నుంచి 13, కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది, ఇండిపెండెంట్లు ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. 

రంగారెడ్డి జిల్లాలో 80 నామినేషన్లు
రంగారెడ్డి జిల్లాలో తొలిరోజు 80 నామినేషన్లను అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు స్వీకరించారు. వంద డివిజన్లకు 35, అలాగే 251 వార్డులకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. షాద్‌నగర్, శంకర్‌పల్లిలో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులతోపాటు ఆయా మున్సిపాలిటీల్లో టీడీపీ, స్వతంత్రులు కూడా నామినేషన్లు సమర్పించారు. నామినేషన్‌ పత్రాల దాఖలు గడువు 10వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

నామినేషన్లు ఇలా..  
కార్పొరేషన్లు అయిన బడంగ్‌పేటలో 17, మీర్‌పేటలో 15, బండ్లగూడలో 3, మున్సిపాలిటీలు తుర్కయంజాల్‌లో 6, ఆదిబట్లలో 5, పెద్దఅంబర్‌పేటలో 14, నార్సింగి, ఇబ్రహీంపట్నంలో ఒకటి చొప్పున, మణికొండలో 3, జల్‌పల్లి, తుక్కుగూడలో రెండు చొప్పున, శంషాబాద్‌లో 6, ఆమనగల్లులో 5 నామినేషన్లు అందాయి.

మరిన్ని వార్తలు