కొత్త కొలువులు 13,357

7 May, 2017 08:29 IST|Sakshi
కొత్త కొలువులు 13,357

విద్యుత్‌ సంస్థల్లో కొత్త పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వం అనుమతి
పాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
పదోన్నతుల ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు.. ఆపై ఏర్పడే ఖాళీల గుర్తింపు
ప్రత్యక్ష నియామకాల ద్వారా ఆ ఖాళీల భర్తీకి ప్రత్యేక అనుమతులు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 3,441 పోస్టులతోపాటు జెన్‌కోలో 4,329, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 2,336, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 3,251 పోస్టులు కలిపి మొత్తం 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల కేటగిరీలవారీగా పరిశీలిస్తే నాలుగు విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం ఇంజనీరింగ్‌ విభాగంలో 4,261 పోస్టులు, అకౌంట్స్‌ విభాగంలో 1,155 పోస్టులు, పీ అండ్‌ జీ విభాగంలో 305, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో 7,474, కెమికల్‌ విభాగంలో 124, హెచ్‌ఆర్‌ విభాగంలో 38 పోస్టులున్నాయి.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపు, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్సీడీసీఎల్‌ సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కావాల్సిన మానవవనరుల సమీకరణ కోసం ప్రభుత్వం కొత్త పోస్టుల సృష్టికి అంగీకారం తెలిపింది. ఈ పోస్టులను భర్తీ చేసే ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి పొందాలని ప్రభుత్వం కోరింది. కొత్త పోస్టులను సృష్టించడం ద్వారా పడే ఆర్థిక భారాన్ని విద్యుత్‌ సంస్థలే భరించాలని, ప్రభుత్వం నుంచి అదనపు సబ్సిడీలు కోరవద్దని స్పష్టం చేసింది. తాజాగా సృష్టించిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. పదోన్నతుల తర్వాత అంతే సంఖ్యలో కింది స్థాయిల్లో ఏర్పడే ఖాళీలను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేస్తామని పేర్కొంది. పదోన్నతుల అనంతరం ఏర్పడే ఖాళీలను గుర్తించాక వాటి భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేయనుంది.

మరిన్ని వార్తలు