ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలల్ల

25 May, 2020 02:25 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో 13 వేల టన్నుల మంచినూనె హాంఫట్‌!

ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిన మార్కెట్‌

దుకాణాల్లో కొరత లేకుండా అన్ని బ్రాండ్లు మళ్లీ ప్రత్యక్షం

వలస కార్మికులు వెళ్లిపోవడంతో కొత్త సమస్య

ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న తయారీదారులు

కరోనా భయం అక్కరలేదంటున్న ఆయిల్‌ కంపెనీలు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ముగిసేనాటికి కొంతమంది ప్రజలకు చొక్కాల గుండీలు పట్టవని, ఇళ్ల ద్వారాల నుంచి బయటకు రావటం కూడా కష్టమని.. సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. తినడం.. కూర్చోవటం.. తినడం.. పడుకోవటం.. ఇదే ప్రధాన దినచర్య కావడంతో అమాంతం పొట్టలు పెరుగుతాయన్నది వాటి సారాంశం. జోకుల సంగతేమోగానీ.. ప్రజలు చిరుతిళ్లు మాత్రం బాగానే లాగించేశారు. ఎంతగా అంటే.. లాక్‌డౌన్‌ సమయంలో ఏకంగా దాదాపు 13 వేల టన్నుల మంచినూనె అదనంగా వినియోగించారు. లాక్‌డౌన్‌తో కొన్ని రంగాలు నష్టపోయినా, నూనె పరిశ్రమ మాత్రం గృహావసరాలకు సంబంధించి అదనపు అమ్మకాలతో కులాసాగా ఉంది.

లాక్‌డౌన్‌ వేళ ఇళ్లకే పరిమితమైన జనం చిరుతిండిపై దృష్టి పెట్టడంతో అంతమేర అదనంగా నూనె ఖర్చయిపోయింది. ఓ దశలో డిమాండ్‌ను మంచినూనె కంపెనీలు అందుకోలేకపోయాయి. మామూలుగా వినియోగమయ్యే నూనె వాడకంకంటే దాదాపు 25 శాతం అదనంగా వాడినట్టు ఆయిల్‌ కంపెనీలు లెక్కలు తేలుస్తున్నాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావటంతో అదనపు వినియోగానికి బ్రేక్‌ పడింది. సాధారణంగా ఎండాకాలం తీవ్రత అధికంగా ఉండే మే నెలలో మంచినూనె వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ ఈనెల తొలివారంలో వినియోగం చాలా ఎక్కువగా నమోదైంది. ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకోవటంతో నూనె కంపెనీలు తేరుకున్నాయి.

వాణిజ్య వినియోగం 80 శాతం తగ్గుదల.. 
సాధారణంగా మంచి నూనె వినియోగాన్ని కంపెనీలు మూడు రకాలుగా విభజిస్తాయి. పారిశ్రామిక అవసరాలైన బిస్కెట్లు, చాక్లెట్స్, ఐస్‌క్రీం తయారీదారులకు ముడి నూనెను అందిస్తాయి. లాక్‌డౌన్‌ సమయంలో పరిశ్రమలు కొంతకాలం పూర్తిగా నిలిచిపోవటంతో ఈ నూనె వాడకం కూడా బాగా తగ్గిపోయింది. ఒక దశలో వాణిజ్య వినియోగం ఏకంగా 80 శాతం పడిపోయింది. ఆ తర్వాత పరిశ్రమలకు అవకాశం కల్పించటంతో మళ్లీ డిమాండ్‌ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలకు సరఫరా చేసే నూనెను వాణిజ్య కేటగిరీ కింద పరిగణిస్తారు. జనతా కర్ఫ్యూ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసే ఉండటంతో ఆ నూనె వినియోగం పూర్తిగా నిలిచిపోయింది. టేక్‌ అవేకు అనుమతిచ్చిన కారణంగా కేవలం 20 శాతం వినియోగం మాత్రమే జరిగినట్టు గుర్తించారు.

వలస కూలీలు లేక కొత్త చిక్కులు.. 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో లక్షల సంఖ్యలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవటంతో మంచినూనె తయారీకి ఇబ్బందులు వచ్చిపడ్డాయి. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా నూనెను మార్కెట్‌కు తరలించటంలో కొంత ఇబ్బంది తప్పేలా కనిపించటం లేదు. మంచినూనె తయారీకి సంబంధించి రిఫైనరీలో పెద్దగా వలస కూలీల అవసరం ఉండదు. కానీ ప్యాకింగ్, మార్కెట్‌కు సరఫరాలో వారి అవసరం ఉంది. ప్యాకింగ్‌ కార్మికుల్లో 30 శాతం వలస కూలీలే. ఇప్పుడు వారు పెద్ద సంఖ్యలో సొంత ప్రాంతాలకు వెళ్లటంతో తీవ్ర కొరత ఏర్పడింది.

దీంతో దుకాణాలకు మంచినూనె సరఫరాకు కొంత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రస్తుతం సూపర్‌ మార్కెట్లు, సాధారణ దుకాణాల్లో అన్ని ప్రధాన బ్రాండ్ల నూనె అందుబాటులో ఉంటోంది. లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని బ్రాండ్లు అసలే కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి మామూలుగానే ఉంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 10 వరకు కొన్ని రకాల బ్రాండ్లు కనిపించలేదు. మార్కెట్లకు రావటానికి ఉన్న ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవటం ఒక కారణమైతే, కొన్ని చోట్ల నేతలు పెద్ద మొత్తంలో సొంతంగా స్టాక్‌ ఏర్పాటు చేసుకోవటం మరో కారణం. నిరుపేదలకు భోజన వసతి కల్పించటం, వారికి నిత్యావసరాల పంపిణీ కోసం చాలామంది నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో నూనె సమకూర్చుకోవటం కూడా కొరతకు కారణమైందని కంపెనీలు చెబుతున్నాయి.

కొరత రానీయం.. కరోనా భయం అవసరం లేదు
‘‘లాక్‌డౌన్‌ సమయంలో గృహావసరాలకు మంచినూనె వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చాయి. మళ్లీ జనం మార్కెట్లకు వస్తున్నారు. కానీ కరోనా నేపథ్యంలో కొన్ని వస్తువుల విషయంలో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంచి నూనె విషయంలో మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిఫైనరీలు, ప్యాకింగ్, మార్కెట్‌లకు సరఫరా.. అన్ని చోట్లా సిబ్బంది పూర్తిగా కరోనా నిబంధనలు అనుసరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన పదార్థం అయినందున అత్యంత హైజనిక్‌గా వ్యవహరిస్తున్నాం. డిమాండ్‌కు సరిపడా మంచినూనెను సిద్ధంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వలస కూలీల రూపంలో కొత్త సమస్య వచ్చిపడినా, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ – పి.చంద్రశేఖరరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ఫ్రీడం ఆయిల్‌

మరిన్ని వార్తలు