9 గంటలు.. 55 కి.మీ

29 Mar, 2020 02:59 IST|Sakshi
ముస్తాబాద్‌లో కార్మికులు

కామారెడ్డి నుంచి మహబూబాబాద్‌కు 14 మంది కూలీల పాదయాత్ర 

ముస్తాబాద్‌: కరోనా కల్లోలం వసల కూలీలను అతలాకుతలం చేస్తోంది. పనులన్నీ నిలిచిపోగా.. చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తూ.. సొంతూరుకు పయనమవుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన  14 మంది కంకర పనులు చేసేందుకు కామారెడ్డికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు బంద్‌ అయ్యాయి. దీంతో సొంతూరుకు  శనివారం ఉదయం కామారెడ్డి నుంచి మహబూబాబాద్‌కు బయలుదేరారు. ముస్తాబాద్‌కు సాయంత్రం రోడ్డుమార్గాన చేరుకున్నారు. తహసీల్దార్‌ విజయ్, ఎస్సై లక్ష్మారెడ్డి, వైద్యాధికారి సంజీవ్‌రెడ్డి వారి కష్టాలు తెలుసుకుని చలించారు. భోజన వసతి కల్పించారు. అనంతరం ట్రాక్టర్‌లో పంపించారు. 

హైదరాబాద్‌ టు  ఎటపాక 
260 కి.మీ నడకయాతన
పొట్టకూటి కోసం పట్నం వెళ్లిన కూలీలపై కరోనా ప్రభావం పడింది. పనులు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చేసేది లేక ఇంటిబాట పట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం చిమ్మలవాగు గ్రామానికి చెందిన మిడియం పొదయ్య, కురం మల్లేష్, మడకం రమేష్, పద్దం సోమయ్య, పద్దం దుర్గయ్య, ఉంగయ్య, దేవయ్య, చుక్కలు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని దండుమిట్ట తండాకు చేరుకున్నారు. సుమారు 260 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణం చేశామని, ఇంకా 90 కిలోమీటర్లు నడవాల్సి ఉందని వారు తెలిపారు. కాగా, అధికారులు వారిని ప్రత్యేక వాహనంలో సొంతూరుకు పంపించారు.
– జూలూరుపాడు, ( కొత్తగూడెం జిల్లా)

బీదర్‌ నుంచి వచ్చిన  43 మంది అడ్డగింత
కంగ్టి: కర్ణాటకలోని బీదర్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండగా అధికారులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు.  శనివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్‌వాడి చెక్‌పోస్టు గుండా ఉద్యోగులు రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు ఆపివేసినట్లు తహసీల్దార్‌ నాగరాజు తెలిపారు. కలెక్టర్‌ హనుమంతరావుకు ఈ సమాచారం తెలపగా, వచ్చిన వారందరినీ ప్రత్యేక బస్సులో   బీదర్‌కు తిరిగి పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, మండుటెండలో కాలినడకన వచ్చిన వారికి తహసీల్దార్‌ పండ్లు, బిస్కట్లు, తాగునీరు అందించారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండతో పాటు ఏపీలోని చిత్తూరు, అనంతపూర్‌ జిల్లాలకు చెందిన ఈ ఉద్యోగులు దాదాపు 55 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బీదర్‌లో ఉండలేక వీరు స్వస్థలాలకు బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు