14 లక్షల మందికి అందని పంట రుణం

26 Nov, 2016 03:40 IST|Sakshi
14 లక్షల మందికి అందని పంట రుణం

ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకుగాను.. 22.50 లక్షల మందికే రుణాలు
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట రుణాలు అందడం లేదు.ఎన్నడూ లేనివిధంగా బ్యాంకుల నుంచి రైతులకు సహకారం తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 36.52 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ 22.50 లక్ష ల మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. అంటే ఏకంగా 14.02 లక్షల మంది రైతులకు ఖరీఫ్ పంట రుణాలు అందలేదు. రాష్ట్ర స్థాయి బ్యాం కర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
 
రబీ సీజన్‌లోనూ అదే పరిస్థితి..
ఎస్‌ఎల్‌బీసీ నివేదిక ప్రకారం ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.17,460 కోట్లుకాగా... బ్యాంకులు రూ.15,205 కోట్ల (87.08%) మేర పంట రుణాలు ఇచ్చాయి. శాతంలో ఇది ఎక్కువగా కనిపించినా తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులకు రుణాలు అందలేదు. రబీ సీజన్‌లోనూ రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రబీలో పంట రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు రూ.4 వేల కోట్ల మేర రుణాలు మాత్రమే ఇచ్చాయని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.9,202 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇచ్చింది రూ.3,690 కోట్లే. రైతుల పట్ల బ్యాంకర్లు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నారంటూ వ్యవసాయ అధికారులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
 
వెనుకబడిన ప్రభుత్వ రంగ బ్యాంకులు
రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులే మొండి చెరుు్య చూపిస్తుండడం గమనార్హం. ఖరీఫ్‌లో ప్రభుత్వ బ్యాంకుల పంట రుణ లక్ష్యం రూ.10,348.56 కోట్లు కాగా.. ఇచ్చింది రూ.7,786.42 కోట్లు (75.24 శాతం) మాత్రమే. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.812.71 కోట్లుకాగా.. రూ. 1,192.28 కోట్లు ఇచ్చాయి. అంటే 146.70 శాతం రుణాలు ఇచ్చాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,999.95 కోట్లు కాగా.. రూ.3,372.96 కోట్లు (112.43 శాతం) అందించాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. వాటి ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.3,299.60 కోట్లు కాగా.. రూ.2,853.74 కోట్లు (86.49 శాతం) మాత్రమే ఇచ్చాయి.
 
ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య అగాధం
ప్రభుత్వం రుణమాఫీ నిధులను, పావలా వడ్డీ సొమ్మును సకాలంలో విడుదల చేయకపోవడం వల్లే రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని పెంచింది. ఇటీవలి ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకుల తీరుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విరుచుకుపడడం అందుకు నిదర్శనం కూడా. అంతర్గత సమావేశాల్లో కాకుండా ప్రజల్లో ఉంటే బ్యాంకుల దుమ్ముదులిపే వారమంటూ ఆయన బ్యాంకర్లపై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ఘర్షణ వైఖరి వల్ల నష్టమేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు