బాలికలకు 14 శాతం సీట్లు!

6 Feb, 2018 03:41 IST|Sakshi

సూపర్‌ న్యూమరరీగా సృష్టించి ఇవ్వాలని ఎంహెచ్‌ఆర్‌డీ ఆదేశాలు 

కసరత్తు ప్రారంభించిన ఎన్‌ఐటీలు 

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లోనూ బాలికలకు 14% సీట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ ఆర్‌డీ) నిర్ణయించింది. 20 శాతం కంటే తక్కువ మంది బాలికలు ఉన్న ఎన్‌ఐటీల్లో ఈ సీట్లు సృష్టించి భర్తీ చేయా లని పేర్కొంది.

బాలుర కోటాకు భంగం వాటిల్లకుండా బాలికల కోసం సూపర్‌ న్యూమరరీ కింద సీట్లు సృష్టించి భర్తీ చేయాలని సూచించింది. బాలికల నమోదును పెంచేందుకు ఐఐటీల్లో చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎన్‌ఐటీల్లోనూ సీట్లు పెంచేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని ఎన్‌ఐటీలకు లేఖలు రాసినట్లు తెలిసింది. 2018–19 విద్యాసంవత్సరంలో 14 శాతం, 2019–20లో 17 శాతం, 2020–21లో 20 శాతం సీట్లు కేటాయించాలని, బాలికల నమోదును 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీల్లోనూ సీట్లు పెరగనున్నాయి. 

తగ్గిన నమోదు శాతం 
2016–17 విద్యా సంవత్సరం వరకు ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ స్కోర్‌తోపాటు ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేసే వారు. దీంతో 2016లో ఎన్‌ఐటీల్లో 20 శాతం బాలికలు చేరారు. 2017–18 నుంచి ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీని తొలగించి కేవలం జేఈఈ స్కోర్‌ ఆధారంగానే సీట్లను కేటాయిస్తున్నారు. దీంతో 2017–18లో చాలా ఎన్‌ఐటీల్లో బాలికల నమోదు 15 శాతానికి పడిపోయింది. దీంతో ఎన్‌ఐటీల్లోనూ సూపర్‌ న్యూమరరీ సీట్లను సృష్టించి బాలికల నమోదును పెంచాలని కేంద్రం నిర్ణయించింది. బాలికల నమోదు 20 శాతం కంటే తక్కువ ఉన్న ఎన్‌ఐటీల్లో సీట్లను పెంచనుంది.  

>
మరిన్ని వార్తలు